IKEA store: బెంగళూరు ఐకియా స్టోర్ కు తండోపతండాలుగా జనం

IKEA Bengaluru sees 3 hour wait as store witnesses huge weekend rush

  • వారాంతంలో మరింత పెరిగిన రద్దీ
  • శనివారం ఒక్క రోజే 20వేల మంది సందర్శన
  • ఆదివారం కూడా ఇదే పరిస్థితి
  • మూడు గంటల పాటు వేచి చూసినా ఎంట్రీ లేని పరిస్థితి

ప్రముఖ అంతర్జాతీయ రిటైల్ సంస్థ, స్వీడన్ కు చెందిన ఐకియా.. బెంగళూరులో మొదటి స్టోర్ ప్రారంభించింది. ఈ నెల 22న నాగసంద్ర ప్రాంతంలో ఈ స్టోర్ మొదలైంది. ఐకియా స్టోర్ ను చూడాలన్న ఆసక్తి బెంగళూరు నగర వాసుల్లో ఏర్పడింది. ఫలితమే స్టోర్ ముందు భారీ జనసందోహం. వేలాది మంది తరలి రావడంతో వారిని నియంత్రించలేక సెక్యూరిటీ గార్డులు చేష్టలుడిగి ఉండిపోవాల్సి వచ్చింది. ఈ నెల 22న మొదలైనా.. ఆదివారం వరకు రద్దీ తగ్గలేదు. పైగా స్టోర్ మొదలైన తర్వాత మొదటి వీకెండ్ కావడంతో రద్దీ ఇంకా పెరిగింది.

దీంతో స్టోర్ లోకి అడుగు పెట్టేందుకు కస్టమర్లు 3 గంటలకు పైగా బయట క్యూలో వేచి చూడాల్సి వచ్చింది. కొందరు కస్టమర్లు వేచి చూసి, స్టోర్ లోకి వెళ్లలేక తిరుగు ముఖం పట్టారు. అంతకుముందు రోజున శనివారం కూడా ఇదే పరిస్థితి నెలకొంది. శనివారం ఒక్క రోజు 20వేల మంది స్టోర్ ను సందర్శించారు. నాగసంద్ర మెట్రో స్టేషన్ కు సాధారణ రోజుల్లో 13 వేల మంది ప్రయాణికులు వచ్చి పోతుండగా.. శనివారం 30,067 మంది ప్రయాణించారు. దీంతో ఐకియా ట్విట్టర్ పై ఓ ప్రకటన విడుదల చేసింది.

‘‘మీ ప్రతిస్పందనకు మేము ఉక్కిరిబిక్కిరి అవుతున్నాం. ప్రస్తుతం నాగసంద్ర వద్ద వేచి ఉండాల్సిన సమయం 3 గంటలు. దీనికి అనుగుణంగా షాపింగ్ కు ప్రణాళిక వేసుకోండి’’ అని ట్వీట్ చేసింది. ఐకియా స్టోర్ నిర్వాహకుల తీరుపై కస్టమర్లు అసహనం వ్యక్తం చేశారు. మొదట కొన్ని రోజుల పాటు, రద్దీ తగ్గేంత వరకు రిజిస్ట్రేషన్ విధానం అనుసరించొచ్చుగా? అన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. నాగసంద్ర స్టోర్ 12.2 ఎకరాల విస్తీర్ణంలో, 4,60,000 చదరపు అడుగుల పరిధిలో ఏర్పాటైంది. ఐకియాకు భారత్ లో ఇది మూడో స్టోర్.

IKEA store
bengalore
nagasandra
public rush
waiting
  • Loading...

More Telugu News