Ambati Rambabu: ఆత్మకూరు బరిలో టీడీపీ లేకపోయినా చాలా కుట్రలు చేసింది: అంబటి రాంబాబు

Ambati Rambabu press meet over Atmakur pole result

  • ఆత్మకూరులో వైసీపీ విక్టరీ
  • తాడేపల్లి పార్టీ ఆఫీసులో అంబటి ప్రెస్ మీట్
  • ప్రజలు తమవైపే ఉన్నారని వెల్లడి
  • ప్రతి ఎన్నికకు వైసీపీ ఓట్ల శాతం పెరుగుతోందని వివరణ

ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డిని విజయం వరించడం పట్ల మంత్రి అంబటి రాంబాబు తాడేపల్లిలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో మేకపాటి గౌతమ్ రెడ్డి 22,276 ఓట్ల మెజారిటీతో గెలుపొందితే, ఇవాళ ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి 82 వేలకు పైగా ఓట్ల మెజారిటీ సాధించి ఘనవిజయం పొందారని అంబటి రాంబాబు వివరించారు. 

వచ్చే రెండేళ్ల తర్వాత అధికారంలోకి వస్తామని డంభాలు పలుకుతున్న టీడీపీ సహా ఇతర ప్రతిపక్షాలు... ఏపీలో వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారన్న విషయాన్నిగుర్తించాలని అన్నారు. ప్రతి ఎన్నికకు వైసీపీ ఓట్ల శాతం పెరుగుతోందని స్పష్టం చేశారు. ఆత్మకూరు ఉప ఎన్నిక బరిలో టీడీపీ లేకపోయినా చాలా కుట్రలు చేసిందని అంబటి రాంబాబు ఆరోపించారు. 

టీడీపీ అనుకూల మీడియా సంస్థలు టీవీ 5, ఈనాడు, ఆంధ్రజ్యోతి కుట్రపూరితంగా వ్యవహరించాయని అన్నారు. ఏదో ఒకవిధంగా వైసీపీ ప్రభుత్వంపై బురద చల్లేందుకు అనేక కట్టుకథలు ప్రచారం చేస్తున్నాయని తెలిపారు. ఇవాళ కూడా మద్యంలో విషం అంటూ ఈనాడు పత్రికలో ఓ కథనం వచ్చిందని, ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే ఈ విధమైన దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. "విషం మద్యంలో లేదు... మీ బుర్రల్లో ఉంది" అంటూ నిప్పులు చెరిగారు. టీడీపీ ఎన్ని కుట్రలకు పాల్పడినా, ప్రజలు తమవైపే ఉన్నారన్న విషయాన్ని ఆత్మకూరు ఎన్నికలు రుజువు చేశాయని పేర్కొన్నారు.

Ambati Rambabu
Atmakur
Mekapati Vikram Reddy
YSRCP
TDP
  • Loading...

More Telugu News