Tesla: మూడు నెలల్లో టెస్లా ‘ఆప్టిమస్‌’ రోబో.. ప్రకటించిన ఎలాన్‌ మస్క్‌

Tesla plans unveil Optimus humanoid robot September

  • ఆరు అడుగుల ఎత్తుతో మనుషులను పోలిన రోబో
  • గంటకు 8 కిలోమీటర్ల వేగం
  • పరిశ్రమల్లో పనుల నుంచి కిరాణా సరుకులు తెచ్చేదాకా అన్ని పనులు చేస్తుందన్న మస్క్
  • కృత్రిమ మేధ పరిజ్ఞానంతో సేవలు అందిస్తుందని వెల్లడి

అచ్చం మనుషులను పోలిన (హ్యుమనాయిడ్) రోబో ‘ఆప్టిమస్’ను మూడు నెలల్లో ఆవిష్కరించనున్నట్టు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రకటించారు. టెస్లా సంస్థ ‘కృత్రిమ మేధ దినోత్సవం’గా జరుపుకొనే సెప్టెంబర్ 30వ తేదీన ఈ రోబో ప్రొటో టైప్ ను ప్రదర్శిస్తామని తాజాగా వెల్లడించారు. 

మనుషులకు మంచి తోడుగా ఈ రోబో ఉంటుందని.. అవసరమైన పనులన్నీ చేస్తుందని ప్రకటించారు. పరిశ్రమల్లో ప్రమాదకరమైన పనులు చేయడం నుంచి షాపింగ్ మాల్ కు వెళ్లి సరుకులు తేవడం వరకు చాలా రకాల పనులకు ఉపయోగించుకోవచ్చని తెలిపారు. కారు టైరు పంచరైతే బోల్టులు మార్చడం వంటి పనులూ చేయగలదని పేర్కొన్నారు.

  • ‘‘టెస్లా సంస్థలో మంచి ప్రతిభ ఉన్న నిపుణుల బృందం ఉంది. అత్యుత్తమ హ్యుమనాయిడ్ రోబోను అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తోంది. నేను కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాను. సెప్టెంబర్ చివరి నాటికి దాని రూపకల్పన పూర్తవుతుంది” అని ఎలాన్ మస్క్ తెలిపారు. దీనికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని.. రోబోను ఆవిష్కరించే రోజున వెల్లడిస్తామని చెప్పారు.
  • ఐదు అడుగుల 8 అంగుళాల ఎత్తు ఉండే ఈ రోబో గంటకు 8 కిలోమీటర్ల వేగంతో నడవగలదని టెస్లా సంస్థ ప్రకటించింది. ఇది మనుషులు నడిచే వేగం కంటే ఎక్కువని తెలిపింది. 70 కిలోల వరకు బరువును సునాయాసంగా ఎత్తగలదని పేర్కొంది.

కృత్రిమ మేధ పరిజ్ఞానంతో..
టెస్లా తమ డ్రైవర్ లెస్ కార్లలో వినియోగించే ఆటో పైలట్ కంప్యూటర్, ప్రోగ్రామ్ లను తమ ‘ఆప్టిమస్’ రోబోలలో కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ సాంకేతికత తమ చుట్టూ ఉన్న వస్తువులు, మనుషులు, భవనాలు, జంతువులు ఇతర అంశాలను గుర్తించగలదని తెలిపింది. దీనిని రోబోకు అనుగుణంగా మార్పులు చేసి.. అత్యుత్తమ సెన్సర్లు, కెమెరాలతో ప్రభావవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించింది.

ఐ రోబో సినిమాలోని.. ‘ఎన్ఎస్5’ రోబోలా..
2004లో విడుదలైన ‘ఐ రోబో’ సినిమాలోని ఎన్ఎస్5 రోబోను తలపించేలా టెస్లా ఆప్టిమస్ రోబో ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ఆ సినిమాలో రోబోలు ‘కృత్రిమ మేధ (ఏఐ)’ పరిజ్ఞానంతో పనిచేస్తుంటాయి. ఈ క్రమంలో సొంతంగా స్వీయ చైతన్యాన్ని పొందిన ఓ రోబో.. ఇతర దుష్ట రోబోలతో పోరాడటం వంటి దృశ్యాలు ఉండటం గమనార్హం.

  • Loading...

More Telugu News