USA: సుప్రీంకోర్టు తీర్పు అత్యంత విషాదకర తప్పిదం: అమెరికా అధ్యక్షుడు బైడెన్​

tragic error by the Supreme Court in my view says Joe Biden on abortion rights ruling

  • అబార్షన్ హక్కును రద్దు చేసిన అమెరికా సుప్రీంకోర్టు
  • తప్పుబట్టిన అధ్యక్షుడు జో బైడెన్ 
  • ఈ తీర్పుతో దేశం 150 ఏళ్లు వెనక్కి వెళ్తొందని వ్యాఖ్య

మహిళలకు అబార్షన్ హక్కును రద్దు చేస్తూ అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ తప్పుబట్టారు. అమెరికా ప్రజల ప్రాథమిక హక్కును కాలరాసే ఈ తీర్పుతో సుప్రీంకోర్టు  అత్యంత విషాదకరమైన తప్పిదం చేసిందని వ్యాఖ్యానించారు. ఈ తీర్పు దేశాన్ని 150 ఏళ్లు వెనక్కి తీసుకెళుతోందన్నారు. 

‘కోర్టు ఇంతకు ముందెన్నడూ చేయని పని చేసింది. అమెరికన్లకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కును తొలగించింది. ఇది తీవ్ర భావజాలం. నా దృష్టిలో సుప్రీంకోర్టు చేసిన విషాదకర తప్పిదం’ అని బైడెన్ ట్వీట్ చేశారు. 

    గర్భస్రావానికి రాజ్యాంగ రక్షణ కల్పించే చట్టాన్ని రద్దు చేస్తూ అమెరికా సుప్రీంకోర్టు  తీర్పునిచ్చింది. దాదాపు 50 ఏళ్ల కిందట ‘రో వర్సెస్ వేడ్’ కేసులో మహిళలకు అబార్షన్ హక్కును అనుమతిస్తూ వెలువడిన నాటి చారిత్రాత్మక తీర్పును సుప్రీం కొట్టివేసింది. అమెరికాలో 1973లో ‘రో వర్సెస్ వేడ్’ కేసులో అబార్షన్ కు చట్టబద్ధత కల్పిస్తూ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. 

ఇక అప్పటినుండి అగ్రరాజ్యంలో అబార్షన్లు చట్టబద్ధమయ్యాయి. అయితే నియంత్రణ లేని గర్భస్రావాలు మహిళల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని, వాటిని రద్దు చేయాలని అమెరికాలో కొందరు పోరాటం చేస్తున్నారు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు  గర్భస్రావం చేసే హక్కును రాజ్యాంగం ఇవ్వలేదని భావిస్తున్నామని పేర్కొంది. 

 కోర్టు తీర్పు పట్ల అమెరికా అధ్యక్షుడు బైడెన్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సహా పలువురు ప్రముఖులు  విస్మయం వ్యక్తం చేశారు. అమెరికాకు ఇది విచారకరమైన రోజని, అబార్షన్ కు చట్టబద్ధత తొలగించడంతో ఎంతో మంది మహిళల ఆరోగ్యం, జీవితం ప్రమాదంలో పడతాయని బైడెన్ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల హక్కులను కాపాడేందుకు తన అధికారాలను ఉపయోగించి అవసరమైన కృషి చేస్తానని బైడెన్ చెప్పారు. మరోవైపు ఈ తీర్పును వ్యతిరేకిస్తూ అమెరికా ప్రజలు సుప్రీంకోర్టు ఎదుట నిరసనకు దిగారు.

USA
Joe Biden
Supreme Court
obama
  • Loading...

More Telugu News