YSRCP: విశాఖ‌కు పరిపాల‌న రాజ‌ధాని ఖాయం... ఎవ‌రు ఆపినా ఆగ‌దు: విజ‌య‌సాయిరెడ్డి

ysrcp mp vijay sai reddy comments on administrative capital to vizag

  • చంద్ర‌బాబు త‌ల‌కిందులు త‌పస్సు చేసినా ఫ‌లితం లేదన్న వైసీపీ ఎంపీ
  • రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో మద్దతు ఎవ‌రికి ఇవ్వాల‌న్న దానిపై నిర్ణ‌యం తీసుకోలేద‌ని వెల్ల‌డి
  • అయ్య‌న్న ఆక్ర‌మణ‌లను అధికారులు చూసుకుంటార‌ని వ్యాఖ్య‌

విశాఖ‌కు ఏపీ ప‌రిపాల‌నా రాజ‌ధాని వ‌చ్చి తీరుతుంద‌ని వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి అన్నారు. ఈ విష‌యంలో ఎవ‌రు ఆపినా విశాఖ‌కు ప‌రిపాల‌న రాజ‌ధాని ఆగ‌దని కూడా ఆయ‌న అన్నారు. టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు త‌ల‌కిందులు త‌ప‌స్సు చేసినా విశాఖ‌కు ప‌రిపాల‌న రాజ‌ధానిని అడ్డుకోలేర‌న్నారు. ఈ మేర‌కు గురువారం విశాఖ వచ్చిన సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ సాయిరెడ్డి ఈ వ్యాఖ్య‌లు చేశారు.

రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ మ‌ద్ద‌తు ఎవ‌రికి ఇవ్వాల‌న్న విష‌యంపై తాము ఇంకా నిర్ణ‌యం తీసుకోలేద‌ని  సాయిరెడ్డి చెప్పారు. ఈ విష‌యంలో పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌నే నిర్ణ‌యం తీసుకుంటార‌ని ఆయ‌న తెలిపారు. అయినా అణ‌గారిన వర్గాల‌కు అత్యున్న‌త ప‌ద‌వులు ఇస్తామంటే ఎవ‌రు కాదంటార‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు. 

ఇక కాలువ‌లు, చెరువులు, న‌దులు ఆక్ర‌మించే హ‌క్కు ఎవ‌రికీ లేద‌ని ఆయ‌న అన్నారు. టీడీపీ నేత అయ్య‌న్న‌పాత్రుడు చెరువు కాలువ‌ను ఆక్ర‌మించార‌న్న సాయిరెడ్డి.. అయ్య‌న్న‌కు హైకోర్టులో తాత్కాలికంగా స్టే ద‌క్కి ఉండొచ్చ‌న్నారు. అయ్య‌న్న ఆక్ర‌మ‌ణ‌ల విష‌యాన్ని అధికారులు చూసుకుంటార‌ని ఆయ‌న తెలిపారు.

YSRCP
Vijay Sai Reddy
Vizag
TDP
Chandrababu
Ayyanna Patrudu
  • Loading...

More Telugu News