Chandrababu: చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి

YCP MLA Nallapureddy Praises TDP Chief Chandrababu

  • జంగాలకండ్రికలో ఉప ఎన్నిక ప్రచారం
  • ఆత్మకూరు ఉప ఎన్నికలో పోటీకి దిగని చంద్రబాబును మనం అభినందించాలన్న నల్లపురెడ్డి
  • చంద్రబాబుకున్న పాటి జ్ఞానం కూడా బీజేపీ వాళ్లకు లేదని ఆగ్రహం

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడిపై వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. ఆయనకున్న పాటి జ్ఞానం బీజేపీ వాళ్లకు లేకుండా పోయిందని విరుచుకుపడ్డారు. ఆత్మకూరు ఉప ఎన్నికలో భాగంగా ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామితో కలిసి నిన్న సంగం మండలంలోని జంగాలకండ్రికలో ఆయన ప్రచారం నిర్వహించారు. 

ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ వారిని మనం అభినందించాలని అన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి చనిపోతే, అదే కుటుంబం నుంచి ఎవరైనా పోటీలోకి దిగితే అక్కడ తమ అభ్యర్థిని నిలపబోమన్న సంప్రదాయాన్ని చంద్రబాబు పాటిస్తూ వస్తున్నారని, ఇందుకు మనం ఆయనను అభినందించాలని అన్నారు.

ఆ మాత్రం జ్ఞానం బీజేపీ వాళ్లకు లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌతంరెడ్డి మరణం తర్వాత బీజేపీ వారు విలేకరుల సమావేశాలు పెట్టి మరీ ఆయనను పొగిడారని, మనసున్న మారాజంటూ కీర్తించారని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు వారే ఇక్కడ పోటీలోకి దిగడం దారుణమైన విషయమని నల్లపురెడ్డి అన్నారు. 

కాగా, మేకపాటి గౌతంరెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన ఈ స్థానంలో ఆయన సోదరుడు విక్రమ్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడి నుంచి మొత్తం 14 మంది బరిలో ఉన్నారు. ఈ నెల 23న ఇక్కడ పోలింగ్ జరగనుండగా, 26న ఫలితాలు వెల్లడికానున్నాయి.

Chandrababu
TDP
YSRCP
Atmakur
Mekapati Vikram Reddy
Nallapureddy Prasanna Kumar Reddy
  • Loading...

More Telugu News