Fake Police: ఒక్కసారి బైక్ ఇస్తే పని చూసుకుని వస్తానంటాడు... బైక్ ఇస్తే ఇక అంతే సంగతులు!

Fake police under arrest in Vizag

  • విశాఖలో ఓ వ్యక్తికి టోకరా వేసిన పాతనేరస్తుడు
  • బైక్ తీసుకెళ్లి మళ్లీ రాని వైనం
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
  • ఫోన్ నెంబరు ట్రాక్ చేసి అరెస్ట్ చేసిన పోలీసులు

తాను పోలీసునంటూ ఓ వ్యక్తి అనేక నేరాలకు పాల్పడడం తాజాగా వెలుగులోకి వచ్చింది. అతడి పేరు వెలుగుల వెంకటరమణ. వయసు 42 సంవత్సరాలు. అల్లూరి సీతారామరాజు జిల్లా రేలంగి గ్రామానికి చెందినవాడు. తన పేరు రాహుల్ అని, తాను పోలీసునని చెప్పుకుంటూ ప్రజలకు టోకరా వేస్తుంటాడు. 

తాజాగా, విశాఖలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఈశ్వరరావు అనే వ్యక్తి నుంచి ఇలాగే బైక్ కొట్టేశాడు. తాను ఇక్కడి ఆర్టీసీ కాంప్లెక్స్ లోని పోలీసు అవుట్ పోస్టులో పనిచేస్తున్నానని, అర్జంటు పని ఉందని, బైక్ ఇస్తే పనిచూసుకుని వస్తానని ఈశ్వరరావుతో చెప్పాడు. అతడు పోలీసు యూనిఫాంలో ఉండడంతో నిజమేనని నమ్మిన ఈశ్వరరావు తన బైక్ తాళాలు ఇచ్చాడు.

అయితే ఎంతసేపటికీ అతడు తిరిగిరాకపోవడంతో ఆర్టీసీ కాంప్లెక్స్ లోని పోలీసు అవుట్ పోస్టు వద్దకు వెళ్లాడు. అయితే, అక్కడ రాహుల్ అనే పేరుగలవాళ్లెవరూ లేరని పోలీసులు చెప్పడంతో తాను మోసపోయానని గుర్తించి ఈశ్వరరావు లబోదిబోమన్నాడు. దీనిపై నగరంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్నారు.

సీసీ కెమెరా ఫుటేజి పరిశీలించగా, పాత నేరస్థుడు వెలుగు వెంకటరమణే ఆ నకిలీ పోలీసు అని గుర్తించారు. అతడి సెల్ ఫోన్ నెంబరును ట్రాక్ చేయడం ద్వారా ఆచూకీ గుర్తించి, అరెస్ట్ చేశారు. ఈశ్వరరావు నుంచి కొట్టేసిన బైక్, పోలీసు యూనిఫాం, ఐడీ కార్డు, నేమ్ ప్లేట్ స్వాధీనం చేసుకున్నారు. వెంకటరమణపై అరకు, ఎస్. కోట, కాకినాడ, ఏలూరు, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో అనేక కేసులు ఉన్నట్టు వెల్లడైంది.

Fake Police
Cheating
Bike
Police
Vizag
  • Loading...

More Telugu News