West Bengal: పెట్రోలు, డీజిల్ ధరలపై రెండు వారాల్లో పన్నులు తగ్గించండి.. లేదంటే ఆందోళనే: బెంగాల్ ప్రభుత్వానికి బీజేపీ హెచ్చరిక

BJPs ultimatum on fuel prices to Mamata Banerjee govt in West Bengal
  • కేంద్రం జీఎస్టీ బకాయిలు చెల్లించిందన్న బెంగాల్ బీజేపీ చీఫ్
  • రాష్ట్ర ప్రభుత్వానికి 15 రోజుల గడువు
  • లేదంటే వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపడతామని హెచ్చరిక
  • బకాయిలు రూ. 97 వేల కోట్లు చెల్లిస్తే వచ్చే ఐదేళ్ల వరకు ధరలు పెంచబోమన్న టీఎంసీ
వచ్చే 15 రోజుల్లో ఇంధన ధరలపై పన్నులు ఎత్తివేయాలని, లేదంటే ఆందోళనకు దిగుతామని పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జీఎస్టీ బకాయిలను కేంద్రం క్లియర్ చేసిన నేపథ్యంలో ఇంధన ధరలను తగ్గించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారు. పెట్రోలుపై కనీసం రూ. 5, డీజిల్‌పై 10 తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం రెండుసార్లు పన్నులు తగ్గిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి కూడా ఆ పని చేయలేదని దుమ్మెత్తి పోశారు. ఈ విషయంలో 15 రోజులు మాత్రమే వేచి చూస్తామని, అప్పటికీ ఇంధన ధరల తగ్గింపుపై ఎలాంటి చర్యలు తీసుకోకుంటే తాము వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తామని, సెక్రటేరియట్‌ వరకు ర్యాలీ నిర్వహిస్తామని మజుందార్ హెచ్చరించారు.

కాగా, టీఎంసీ ప్రధాన కార్యదర్శి కునాల్ ఘోష్ ఇటీవల మాట్లాడుతూ.. కేంద్రం నుంచి దాదాపు రూ. 97 వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉందని, వాటిని చెల్లిస్తే ఇంధన ధరలను తగ్గిస్తామని, అంతేకాకుండా వచ్చే ఐదేళ్లపాటు ఇంధన ధరలపై ఎలాంటి పన్నులు విధించబోమని స్పష్టం చేశారు.
West Bengal
BJP
Mamata Banerjee
Fuel Prices
Sukanta Majumdar
Kunal Ghosh

More Telugu News