Black Pepper: మిరియాలు.. ఔషధ గుణాలు!

Incredible Health Benefits Of Black Pepper
  • వీటిల్లో ఎన్నో ఔషధ గుణాలు
  • ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించే యాంటీ ఆక్సిడెంట్స్
  • పేగులకూ మంచి చేస్తుంది
నల్ల మిరియాలు ఔషధ గుణాలు కలిగిన దినుసు. ప్రాచీన కాలంలో దీని వినియోగం ఎక్కువగా ఉండేది. ఆయుర్వేదంలోనూ దీనికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఆహర పదార్థాలకు మంచి రుచిని ఇవ్వడంతోపాటు.. ఆరోగ్యానికి మేలు చేసే వీటి ప్రత్యేకతలు తెలుసుకుందాం..

యాంటీ ఆక్సిడెంట్లు
నల్ల మిరియాల్లో మనకు మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ రూపంలో మన శరీరానికి నష్టం జరగకుండా చూస్తాయి. కాలుష్యం, సిగరెట్ల పొగ, సూర్య కిరణాలకు మన శరీరం గురైనప్పుడు ఫ్రీ రాడికల్స్ ఏర్పడతాయి. ఇది శరీరంలో ఇన్ ఫ్లమేషన్ (వాపు), ముందస్తు వృద్ధాప్యం, గుండె జబ్బులు, కొన్ని రకాల కేన్సర్లకు దారితీస్తుంది. కానీ, మిరియాల్లోని యాంటీ ఆక్సిడెంట్లు ఈ ఫ్రీరాడికల్స్ రూపంలో జరిగే నష్టాన్ని తగ్గిస్తాయి.

యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు
తీవ్రమైన ఇన్ ఫ్లమేషన్ ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. ఆర్థరైటిస్, గుండె జబ్బులు, మధుమేహం, కేన్సర్ వంటి సీరియస్ సమస్యలను కలిగించొచ్చు. నల్ల మిరియాల్లో ఉండే పిపరిన్ ఈ ఇన్ ఫ్లమేషన్ పై పోరాడుతుంది.

పోషకాల సంగ్రహణ
మనం తీసుకునే ఆహారం నుంచి క్యాల్షియం, సిలీనియం తదితర కనీస పోషకాలను శరీరం గ్రహించేందుకు నల్ల మిరియాలు సాయపడతాయి. గ్రీన్ టీ, పసుపులో ఉండే ప్రత్యేకమైన ఔషధ గుణాలు కూడా వీటిల్లో ఉన్నాయి.

పేగులకు మంచిది
నల్ల మిరియాలను నేరుగా తీసుకుంటే హైడ్రో క్లోరిక్ యాసిడ్ విడుదల అవుతుంది. ఇది జీర్ణక్రియకు తోడ్పడుతుంది. పేగులు శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచడంలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ సాయపడుతుంది. దీనివల్ల పేగుల్లోని హానికారకాలు బయటకు వెళతాయి. ఇతర జీర్ణ సమస్యలు తగ్గేందుకు కూడా పనిచేస్తుంది. 

చర్మానికీ మంచిదే
చర్మంలోని పిగ్మెంట్లను కాపాడే గుణాలు మిరియాలకు ఉన్నాయి. చర్మం తెల్లగా పాలిపోవడం చూసే ఉంటారు. దీన్నే పిగ్మెంటేషన్ అంటారు. అంటే చర్మతత్వాన్ని మిరియాలు కాపాడతాయి. అందుకే వంటింటి ఔషధ దినుసుగా మిరియాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఆధునిక జీవనశైలి, మారిన ఆహార నియమాలతో వంటింట్లో ఇవి కనిపించకుండా పోతున్నాయి.
Black Pepper
health benefits

More Telugu News