Sri Lanka: శ్రీలంకలో మరింత దిగజారిన పరిస్థితులు.. స్కూళ్లు, కార్యాలయాల మూత

sri lanka financial crisis decreasing situations day by day
  • నిండుకున్న ఇంధనం.. మూతపడుతున్న రవాణా సౌకర్యాలు 
  • లీటర్ పెట్రోలు కోసం రోజుల తరబడి ఎదురుచూపులు
  • దేశం ముందస్తు దివాలాలో ఉందన్న రిజర్వు బ్యాంకు
  • 70 ఏళ్ల చరిత్రలో తొలిసారి రుణాలను ఎగవేసిన శ్రీలంక
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి అల్లాడిపోతున్న పొరుగుదేశం శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకు మరింత దారుణంగా తయారవుతున్నాయి. ఇంధనం నిండుకోవడంతో రవాణా సౌకర్యాలు మూతపడుతున్నాయి. లీటర్ పెట్రోలు కోసం రోజుల తరబడి పెట్రోలు బంకుల వద్ద ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 

ఇక ఇంధన కొరత కారణంగా రవాణా సేవలు నిలిచిపోవడంతో విద్యా సంస్థలను మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. అలాగే, అత్యవసర సేవలు అందించే కార్యాలయాలు తప్ప మిగతా ప్రభుత్వ ఉద్యోగులెవరూ ఆఫీసులకు రావాల్సిన పనిలేదని ప్రభుత్వ పాలనా విభాగం సూచించింది. 

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను మూసివేయాలని ఆదేశించింది. అయితే, ఈ మూసివేత ఎప్పటి వరకు అన్న విషయంలో స్పష్టత లేదు. దేశ అవసరాలకు సరిపడా ఇంధన నిల్వలు లేకపోవడం, దిగుమతి చేసుకునేందుకు అవసరమైన సొమ్ము లేకపోవడంతో అంతర్జాతీయ సంస్థలు, విదేశీ సాయం కోసం శ్రీలంక ఆశగా ఎదురుచూస్తోంది. 

మరోవైపు, దేశం ముందస్తు దివాలాలో ఉందని శ్రీలంక రిజర్వు బ్యాంకు గవర్నర్ నందలాల్ ప్రకటించారు. అలాగే, శ్రీలంక 70 ఏళ్ల చరిత్రలో తొలిసారి తీసుకున్న రుణాలను అధికారికంగా ఎగ్గొట్టింది. 78 మిలియన్ డాలర్ల రుణానికి సంబంధించి గ్రేస్ పిరియడ్ కూడా ముగిసిపోవడంతో ఎగవేత అధికారికమైంది. శ్రీలంక రుణ ఎగవేతను రెండు రుణ సంస్థలు ధ్రువీకరించాయి.
Sri Lanka
Oil
Ranil Wickremesinghe
Petrol
Diesel
Food

More Telugu News