CM Jagan: ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక పవర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్

  • కర్నూలు జిల్లాలో సీఎం జగన్ పర్యటన
  • ఓర్వకల్లు మండలం గుమ్మితం తండాలో భారీ పవర్ ప్రాజెక్టు
  • రూ.15 వేల కోట్లతో నిర్మిస్తున్న గ్రీన్ కో ఎనర్జీస్ సంస్థ
  • ఐదేళ్లలో ప్రాజెక్టు పూర్తవుతుందన్న సీఎం జగన్
 CM Jagan lays foundation stone for Integrated Renewable Power Project in Kurnool district

ఏపీ సీఎం జగన్ ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఓర్వకల్లు మండలం గుమ్మితం తండాలో ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పవర్ ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ పవర్ ప్రాజెక్టు ప్రత్యేకత ఏంటంటే... ఒకే యూనిట్ లో సోలార్, విండ్, హైడల్ విద్యుత్ ఉత్పాదన చేస్తారు. భారీ మొత్తంలో ఇక్కడ ఎనర్జీ స్టోరేజి కూడా చేస్తారు. ఇటువంటి భారీ ప్రాజెక్టుతో చరిత్ర సృష్టించబోతున్నామని సీఎం జగన్ అన్నారు. 

ఈ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు కోసం గ్రీన్ కో ఎనర్జీస్ సంస్థ రూ.15 వేల కోట్ల పెట్టుబడి పెడుతోందని తెలిపారు. ఈ ప్రాజెక్టులో నిరంతరం పునరుత్పాదక విద్యుదుత్పత్తి జరుగుతుందని వెల్లడించారు. విద్యుత్ వినియోగం తక్కువగా ఉన్న సమయంలో కొంతమేర సోలార్, విండ్ ఎనర్జీ ద్వారా నీటిని పంపింగ్ చేస్తారని తెలిపారు. విద్యుత్ కు డిమాండ్ ఉన్న సమయంలో ఆ నీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తారని వివరించారు. 

గ్రీన్ పవర్ ఉత్పత్తి కోసం చేపట్టిన ఈ ప్రాజెక్టు దేశానికి సరికొత్త మార్గం చూపుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలు కూడా ఇదే తరహా ప్రాజెక్టులు చేపట్టేందుకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. వచ్చే ఐదేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని తెలిపారు.

More Telugu News