Court Case: సుదీర్ఘ కాలం కొనసాగిన కోర్టు విచారణ.. 108 ఏళ్ల తర్వాత వెలువడిన తీర్పు!

Court verdict delivered after 108 years in a civil case

  • 1914లో బీహార్ లోని ఆరా సివిల్ కోర్టులో దాఖలైన దావా
  • మూడు ఎకరాల భూమి కోసం రెండు రాజ్ పుత్ కుటుంబాల మధ్య వివాదం
  • కేసు వేసిన వ్యక్తి ముని మనవడికి అనుకూలంగా తీర్పు

కొన్ని కోర్టు కేసులు ఎప్పటికి తెగుతాయో ఎవ్వరూ చెప్పలేరు. దశాబ్దాల పాటు కేసులు కొనసాగుతూనే ఉంటాయి. కొన్ని తరాలు ఈ కేసులను ఎదుర్కొంటూనే ఉంటాయి. కానీ, ఈ కేసు మాత్రం ఏకంగా శతాబ్ద కాలానికి పైగా కొనసాగింది. 108 ఏళ్ల తర్వాత ఈ కేసుకు సంబంధించి తుది తీర్పు వెలువడింది. 

వివరాల్లోకి వెళ్తే.. బీహార్ లోని భోజ్ పుర్ జిల్లా ఆరా సివిల్ కోర్టులో 1914లో ఈ దావా దాఖలయింది. కోయల్వార్ గ్రామంలో మూడు ఎకరాల భూమికి సంబంధించిన దావా ఇది. యాజమాన్య హక్కుల కోసం రాజ్ పుత్ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి ఈ దావాను వేశారు. 

బీహార్ రాజధాని పాట్నాకు 40 కిలోమీటర్ల దూరంలో ఈ వివాదాస్పద స్థలం ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఎకరం భూమి 5 కోట్లు పలుకుతోంది. అప్పట్లో బ్రిటీష్ పాలన కొనసాగుతున్న సమయంలో కొయిల్వార్ లో అజ్ హర్ ఖాన్ అనే వ్యక్తికి 9 ఎకరాల స్థలం ఉండేది. ఇందులో అతని వారసుల నుంచి కొనుగోలు చేసిన మూడు ఎకరాల స్థలం విషయమై రెండు రాజ్ పుత్ కుటుంబాల మధ్య వివాదం నెలకొంది. ఒక వర్గం కోర్టులో దావా వేసింది. రాజీ కుదుర్చుకునేందుకు రెండు పార్టీలు అంగీకరించలేదు. దీంతో, కేసు విచారణ శతాబ్ద కాలానికి పైగా కొనసాగింది. 

ఎట్టకేలకు మార్చి 11న భోజ్ పుర్ అదనపు జిల్లా జడ్జి శ్వేతాసింగ్ తీర్పును వెలువరించారు. కేసు వేసిన దర్బారీసింగ్ ముని మనవడు అతుల్ సింగ్ తదితరులకు అనుకూలంగా తీర్పును ఇచ్చారు. 

ఈ సందర్భంగా జడ్జి శ్వేతాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 1914 నుంచి సుదీర్ఘ కాలం పాటు ఈ కేసు విచారణ కొనసాగిందని... ఇదే సమయంలో రెండు కుటుంబాలు కొన్ని తరాల వారసులను కోల్పోయాయని ఆమె అన్నారు. ఇప్పటికైనా ఈ వివాదానికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందని చెప్పారు. అయినా.. ఈ వివాదం ఇంతటితో ఆగుతుందని చెప్పలేమని అన్నారు. కేసు ఓడిపోయిన వారు పైకోర్టుకు వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

Court Case
108 Years
Longest Hearing
  • Loading...

More Telugu News