Punjab Kings: కీలక మ్యాచ్‌లో విజయం సాధించిన ఢిల్లీ.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం

Marsh and Shardul Thakur help DC enter Top 4
  • నాలుగో స్థానానికి ఎగబాకిన ఢిల్లీ కేపిటల్స్
  • ఐదో స్థానానికి పడిపోయిన బెంగళూరు
  • నాలుగు వికెట్లు తీసి పంజాబ్‌ను దారుణంగా దెబ్బకొట్టిన శార్దూల్ ఠాకూర్
  • ప్లే ఆఫ్స్ రేసు నుంచి పంజాబ్ ఔట్
ప్లే ఆఫ్స్ ఆశలు నిలుపుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ విజయం సాధించింది. శార్దూల్ ఠాకూర్ నాలుగు వికెట్లు తీసి పంజాబ్‌ కింగ్స్‌ ను దారుణంగా దెబ్బతీశాడు. ఫలితంగా 17 పరుగుల తేడాతో విజయం సాధించిన ఢిల్లీ పాయింట్ల పట్టికలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును కిందికి నెట్టేసి నాలుగో స్థానానికి ఎగబాకింది. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ ప్రత్యర్థికి 160 పరుగుల ఓ మాదిరి లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే, పంజాబ్ బ్యాటర్ల ఘోర వైఫల్యం ఆ జట్టు కొంప ముంచింది. ఢిల్లీపై ఆ జట్టుకు చక్కని విజయాల ట్రాక్ ఉన్నప్పటికీ ఒత్తిడికి లోనై టపటపా వికెట్లు రాల్చేసుకుంది. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 142 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ నిప్పులు చెరిగే బంతుల ముందు పంజాబ్ బ్యాటర్లు నిలవలేకపోయారు. వచ్చినవారు వచ్చినట్టుగా వికెట్లు సమర్పించుకుని పెవిలియన్ చేరారు. బెయిర్‌స్టో 28, శిఖర్ ధావన్ 19, రాహుల్ చాహర్ 25 పరుగులు చేయగా, 34 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 44 పరుగులు చేసి జితేశ్ శర్మ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఏడుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. పంజాబ్ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ శార్దూల్ ఠాకూర్ నాలుగు వికెట్లు పడగొట్టగా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. 

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 159 పరుగుల ఓ మోస్తరు స్కోరు చేసింది. మిచెల్ మార్ష్ అర్ధ సెంచరీ (48 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 63) చేసి ఆపద్బాంధవుడయ్యాడు. సర్ఫరాజ్ ఖాన్ 32, లలిత్ యాదవ్ 24, అక్షర్ పటేల్ 17 పరుగులు సాధించారు. పంజాబ్ బౌలర్లలో లివింగ్‌స్టోన్, అర్షదీప్ సింగ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. ఈ పరాజయంతో పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ ఆశలు అడుగంటిపోయాయి. ఆ జట్టుకు మిగిలి ఉన్న ఇంకొక్క మ్యాచ్ నామమాత్రంగానే మారింది. కాగా, నేడు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్-సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ప్రాధాన్యం లేని మ్యాచ్ జరగనుంది.
Punjab Kings
Delhi Capitals
IPL 2022
Shardul Thakur

More Telugu News