Somireddy Chandra Mohan Reddy: ఇవి జోకులు కాక మరేంటి?... ఏపీ మంత్రులపై సోమిరెడ్డి విమర్శలు

TDP Senior Leader Somireddy comments on AP Ministers

  • ఏపీలో అభివృద్ధిపై సోమిరెడ్డి స్పందన
  • మంత్రులు అద్భుతాలు జరిగాయంటున్నారని వెల్లడి
  • ఎక్కడ ఏం సాధించారో చూపించాలన్న సోమిరెడ్డి
  • కేటీఆర్ వ్యాఖ్యలపైనా స్పందన
  • ఇన్ని ఘనతలు సాధించినందుకు పొగడాలా? అంటూ వ్యాఖ్యలు

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏపీ మంత్రులపై విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో ఏం అభివృద్ధి జరిగిందని గొప్పలు చెప్పుకుంటున్నారని మంత్రులను ప్రశ్నించారు. ఏపీలో అద్భుతమైన రీతిలో అభివృద్ధి జరిగిందంటూ ఏపీ మంత్రులు జోకులు వేస్తున్నారని సోమిరెడ్డి వ్యంగ్యం ప్రదర్శించారు. ఈ మూడేళ్లలో ఎక్కడ ఏం అభివృద్ధి జరిగిందో అర్థంకావడంలేదని అన్నారు. 

రోడ్లపై గుంతలు పడినా పట్టించుకున్నవాళ్లే లేరని, నీటిపారుదల రంగం నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. వ్యవసాయరంగం కుదేలైందని తెలిపారు. 2020-21 బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు రూ.20 వేల కోట్లు కాగా, కేవలం రూ.7 వేల కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కే విలువ ఇవ్వని వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి గురించి ఎలా మాట్లాడుతుందని నిలదీశారు. 

ఈ సందర్భంగా సోమిరెడ్డి తెలంగాణ రాష్ట్రం గురించి ఉదహరించారు. తెలంగాణను చూసి ఏపీ నేర్చుకోవాలని హితవు పలికారు. తెలంగాణలో రైతులకు ఒక ఎకరాకు రూ.10 వేలు ఇస్తుంటే, ఏపీలో ఎన్ని ఎకరాలున్నా రైతు భరోసా కింద కేవలం రూ.7,500 ఇస్తున్నారని వెల్లడించారు. తెలంగాణలో వ్యవసాయ రంగానికి 24 గంటలు విద్యుత్ ఇస్తున్నారని, ఏపీలో వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరా 9 గంటల నుంచి 7 గంటలకు తగ్గిపోయిందని ఆరోపించారు. ఇంతటి ఘనతలు సాధించినందుకు ఏపీ ప్రభుత్వాన్ని పొగడాలా...? అంటూ నిన్న తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. 

పొరుగు రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, కరెంటు కోతలు కూడా అధికమేనని కేటీఆర్ నిన్న క్రెడాయ్ సదస్సులో చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపడం తెలిసిందే. ఏపీ మంత్రులు కౌంటర్ ఇవ్వగా, ఇతర పార్టీల నేతలు మాత్రం కేటీఆర్ నిజమే చెప్పారని అంటున్నారు.

Somireddy Chandra Mohan Reddy
AP Ministers
Jokes
Andhra Pradesh
Telangana
  • Loading...

More Telugu News