Somu Veerraju: కర్నూలు జిల్లాలో హనుమాన్ శోభాయాత్రపై రాళ్లదాడి... సీఎం జగన్ పై మండిపడిన సోము వీర్రాజు

Somu Veerraju fires on CM Jagan after stone pelting at Hanuman Shobha Yatra in Kurnool district

  • హనుమాన్ శోభాయాత్ర హింసాత్మకం
  • రాళ్లు రువ్విన ఓ వర్గం వారు
  • పలువురికి తీవ్రగాయాలు
  • ప్రభుత్వం వెంటనే స్పందించాలన్న సోము వీర్రాజు

కర్నూలు జిల్లాలో హనుమాన్ శోభాయాత్రలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం పట్ల ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రంగా స్పందించారు. కర్నూలు పార్లమెంటు స్థానం పరిధిలో హనుమాన్ శోభాయాత్రపై రాళ్లదాడి జరిగితే మీకు చలనం లేదా? అంటూ సీఎం జగన్ ను ప్రశ్నించారు. అసాంఘిక శక్తులను పెంచి పోషించి రాష్ట్రాన్ని ఏంచేద్దామనుకుంటున్నారు? ఓట్ల కోసం మీరు వహిస్తున్న మౌనం మత కల్లోలాలకు దారితీస్తుంటే మీ కళ్లకు కనిపించడంలేదా? అని మండిపడ్డారు. 

"ప్రజలకు రక్షణ కల్పించలేని వాడు సమర్థవంతమైన పాలకుడు ఎలా అవుతాడు? మీ అసమర్థత కారణంగా ఇంకెంతమంది హిందువులు రక్తం చిందించాలి?" అంటూ నిలదీశారు. ప్రతిపక్షాలను గృహనిర్బంధాల ద్వారా కట్టడి చేయడంలో అసాధారణ ప్రతిభను కనబరుస్తున్న పోలీసులు పౌరుల రక్షణను గాలికొదిలేసే పాలన మీకు మాత్రమే సొంతం జగన్ గారూ అంటూ సోము వీర్రాజు విమర్శించారు. పరిస్థితులను కట్టడి చేసే సామర్థ్యం మీకు లేకపోగా, ప్రశ్నించే తమపై మత రాజకీయ ముద్ర వేయడం ఎంతవరకు ఆమోదయోగ్యం అని ప్రశ్నించారు. 

ప్రభుత్వం తక్షణమే మొద్దు నిద్రను వీడి శోభాయాత్రపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే, తదుపరి పర్యవసానాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తమకు ప్రభుత్వం అండ ఉందనే భావనతో కొన్ని వర్గాల వికృత చేష్టలకు అమాయక హిందువులు బలైపోతున్నారని సోము వీర్రాజు ఆవేదన వ్యక్తం చేశారు. 

"అధికారు పార్టీ ఎమ్మెల్యేలే టిప్పు సుల్తాన్ విగ్రహాలు ఏర్పాటు చేయిస్తారు. జిన్నా టవర్ విషయంలోనూ, శ్రీశైలంలో దేవస్థానంలో అన్యమతస్తుల వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేసి హిందూ భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ హిందూ వ్యతిరేక ప్రభుత్వం నుంచి హిందువులు ఇంతకంటే ఇంకేం ఆశించగలరు? జరుగుతున్న అరాచకాలపై ప్రభుత్వం స్పందించకపోతే కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో నేను పర్యటిస్తా. ప్రజాక్షేత్రంలో మీ నిరంకుశ వైఖరిని ఎండగడతా" అంటూ సోము వీర్రాజు తీవ్రస్థాయిలో స్పందించారు.

Somu Veerraju
Hanuman Shobha Yatra
Stone Pelting
Kurnool District
CM Jagan
Andhra Pradesh
  • Loading...

More Telugu News