edible oil: నూనె ధరలకు చెక్..! నిల్వలపై పరిమితులు విధించిన కేంద్ర ప్రభుత్వం

Centre imposes strict stock limit on edible oil
  • రిటైల్ వర్తకులకు 30 క్వింటాళ్ల పరిమితి
  • టోకు వర్తకులకు 500 క్వింటాళ్లు
  • పెద్ద రిటైల్ సంస్థలకు పరిమితులు వర్తింపు
  • కేంద్ర వినియోగదారుల శాఖ ఆదేశాలు
ఉక్రెయిన్ - రష్యా యుద్ధంతో భారీగా పెరిగిపోయిన వంట నూనెల ధరల నియంత్రణకు కేంద్ర సర్కారు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా నూనెలు, నూనె గింజల నిల్వలపై కఠిన పరిమితులు విధించింది. ఈ ఆంక్షలు 2022 డిసెంబర్ 31 వరకు అమల్లో ఉంటాయి. నూనె గింజల ప్రాసెసర్లు 90 రోజుల ఉత్పత్తికి సరిపడా నూనె నిల్వలనే కలిగి ఉండాలి. ఇక రిటైల్ విక్రేతలు 30 క్వింటాళ్లకు మించి వంట నూనెలను స్టోర్ చేయకూడదు. టోకు వర్తకులు 500 క్వింటాళ్ల వంట నూనెల నిల్వలకే పరిమితం కావాల్సి ఉంటుంది.

బల్క్ రిటైలర్ల (డీమార్ట్, రిలయన్స్ మార్ట్ తరహా) విషయంలోనూ పరిమితులు విధించింది. ఒక స్టోర్ పరిధిలో 30 క్వింటాళ్ల వరకు, డిపో పరిధిలో 1,000 క్వింటాళ్ల వరకే వంట నూనెలను నిల్వ చేసుకోవచ్చు. నూనె గింజల విషయానికొస్తే.. రిటైల్ వర్తకులు 100 క్వింటాళ్ల వరకు, టోకు వర్తకులు 2,000 క్వింటాళ్ల వరకు కలిగి ఉండొచ్చు. ప్రాసెసర్లు 90 రోజుల ఉత్పత్తికి సరిపడా గింజలను నిల్వ చేసుకోవచ్చు. ఈ మేరకు కేంద్ర వినియోగ, ఆహార, ప్రజా పంపిణీ శాఖ ఆదేశాలు జారీ చేసింది. 

ఈ శాఖ వద్దనున్న గణాంకాల ప్రకారం మార్చి 30న ఆవనూనె లీటర్ రూ.188.46గా ఉంది. గతేడాది ఇదే రోజు ధర రూ.148.33. వేరుశనగ నూనె లీటర్ ధర రూ.182.50. గతేడాది ఇదే కాలంలో రూ.166.71గా ఉంది. సన్ ఫ్లవర్ ఆయిల్ లీటర్ రూ.184గా ఉంది. గతేడాది దీని ధర రూ.159. పామాయిల్ ధర కూడా గతేడాది ఇదే కాలంలో ఉన్న రూ.123.14 నుంచి రూ.151.14కు పెరిగింది.
edible oil
storage
controls
limits
prices

More Telugu News