Kerala: నిన్నటి వరకు బెలూన్లు అమ్ముకుంది.. ఇప్పుడు మోడల్‌గా ఆఫర్లు!

A Girl Who Sells Balloons Now Getting Modelling Offers from Companies
  • బెలూన్లు అమ్ముకుంటున్న కిస్బూ ఫొటోలు తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన అర్జున్ కృష్ణన్
  • వైరల్ కావడంతో ఫొటోషూట్‌కు ఒప్పించిన వైనం
  • ఆ ఫొటోలను చూసి మోడల్‌గా తీసుకునేందుకు ముందుకు వస్తున్న కంపెనీలు
అదృష్టం ఎప్పుడు, ఏవైపు నుంచి తన్నుకొస్తుందో ఎవరూ ఊహించలేరు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఊహించని విధంగా రాత్రికి రాత్రే కొందరు స్టార్లుగా ఎదిగిపోతున్నారు. ఇలాంటి వారి పేర్లు చెప్పుకోవాలంటే కొండవీటి చాంతాడంత ఉంటుంది. ఇప్పుడిదంతా ఎందుకంటే.. కేరళకు చెందిన కిస్బూ అనే యువతి పేరు కూడా సోషల్ మీడియాలో మోతెక్కి పోతోంది. 

కిస్బూ బెలూన్లు అమ్ముకుని జీవించే యువతి. జనవరి 17న అందలూరుకావులో జరిగిన జాతరలో బెలూన్లు విక్రయిస్తూ ఫొటోగ్రాఫర్ అర్జున్ కృష్ణన్ దృష్టిని ఆకర్షించింది. వెంటనే అతడు ఆమె ఫొటోలు తీసి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు. ఆ ఫొటోలకు నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన లభించింది.

ఆ ఫొటోలు వైరల్ కావడం అర్జున్‌లో ఉత్సాహాన్ని నింపింది. వెంటనే మళ్లీ కిస్బూ, వాళ్లమ్మను కలిసి తాను తీసిన ఫొటోలు చూపించాడు. వారు కూడా అవి చూసి మెచ్చుకోవడంతో ఫొటోషూట్‌కు ఒప్పించి కిస్బూను తీసుకెళ్లాడు. మేకప్ ఆర్టిస్ట్ రెమ్యా ప్రజుల్‌తో కిస్బూకి మేకప్ వేయించి అందంగా తీర్చిదిద్దాడు. ఆపై ఫొటోషూట్ చేసి ఆ ఫొటోలను తన ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. ఆ ఫొటోలను అలా షేర్ చేశాడో, లేదో లక్షల్లో లైకులు వచ్చాయి. ఆ ఫొటోలు చూసిన కొన్ని కంపెనీలు ఆమెను మోడల్‌గా తీసుకుంటామంటూ ముందుకొస్తున్నాయి.
Kerala
Arjun Krishnan
Photo Shoot
Balloons

More Telugu News