Omicron: ఒమిక్రాన్ పేరుతో సైబర్ దాడులకు పాల్పడుతున్న హ్యాకర్లు

Cyber Attacks by hackers with the name of Omicron Stats

  • ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ విజృంభణ
  • ఒమిక్రాన్ గణాంకాల పేరుతో ఈమెయిల్స్
  • ఫోన్లు, కంప్యూటర్లలోకి రెడ్ లైన్ మాల్వేర్
  • పాస్ వర్డ్ లు, కీలక సమాచారం చోరీ

ప్రపంచవ్యాప్తంగా శరవేగంతో వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ తీవ్ర చర్చనీయాంశంగా ఉంది. సోషల్ మీడియాలోనూ ఇది ట్రెండింగ్ లో ఉంటోంది. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ పేరుతో హ్యాకర్లు సైబర్ దాడులకు పాల్పడుతున్న విషయం వెల్లడైంది. ఈ క్రమంలో ఫోర్టిగార్డ్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ ఆసక్తికర అంశాలను పంచుకుంది.

హ్యాకర్లు రెడ్ లైన్ మాల్వేర్ ను ఈ-మెయిల్స్ ద్వారా ఫోన్లు, కంప్యూటర్లకు పంపుతున్నారని ఫోర్టిగార్డ్ తెలిపింది. తద్వారా పాస్ వర్డ్, ఇతర కీలక సమాచారాన్ని తస్కరిస్తున్నారని పేర్కొంది. అందుకోసం 'ఒమిక్రాన్ స్టాట్స్.ఈఎక్స్ఈ' (omicron stats.exe) అనే ఫైల్ నేమ్ తో ఈ ఆయా వ్యవస్థల్లోకి చొరబడుతున్నట్టు గుర్తించామని వెల్లడించింది.

12 దేశాలకు చెందిన ప్రజలు అధికంగా ఈ రెడ్ లైన్ మాల్వేర్ బారినపడ్డారని తెలిపింది. రెడ్ లైన్ మాల్వేర్ 2020లోనే వెలుగు చూసినా, తాజాగా ఒమిక్రాన్ పేరుతో వేగంగా వ్యాపిస్తోందని ఫోర్టిగార్డ్ పేర్కొంది. రెడ్ లైన్ మాల్వేర్ ద్వారా సేకరించే సమాచారం డార్క్ వెబ్ లో విక్రయిస్తున్నట్టు తెలిపింది. అది కూడా ఎంతో చవకగా ఓ యూజర్ సమాచారాన్ని 10 డాలర్లకు అమ్మేస్తున్నారని వివరించింది. ఒమిక్రాన్, ఇతర కరోనా వేరియంట్ల పేరుతో వచ్చే ఈ-మెయిల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఫోర్టిగార్డ్ సూచించింది.

Omicron
Cyber Attack
Malware
FortiGuard
  • Loading...

More Telugu News