Balineni Srinivasa Reddy: తెలంగాణకు బొగ్గు కొరత లేదు... అక్కడున్న బొగ్గు నిల్వలు ఏపీకి ఇవ్వడంలేదు: ఏపీ మంత్రి బాలినేని

Balineni Srinivasa Reddy explains crisis in fuel sector

  • దేశంలో ఇంధన కొరత
  • బొగ్గు నిల్వలు లేక కుంటుపడిన విద్యుదుత్పత్తి
  • ఏపీలోనూ అదే పరిస్థితి
  • వివరణ ఇచ్చిన విద్యుత్ శాఖ మంత్రి బాలినేని

ఇంధన సంక్షోభం నేపథ్యంలో విద్యుత్ రంగ సమస్యలు తీవ్రతరం కాగా, పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. దీనిపై ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. బొగ్గు కొరత దేశవ్యాప్తంగా ఉందని తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు ఏదో ఒక స్థాయిలో విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్నాయని, ఏపీలో నెలకొన్న సంక్షోభం తాత్కాలికమేనని వివరించారు.

బొగ్గు కొరత దృష్ట్యా రాష్ట్ర విద్యుత్ రంగంలో నెలకొన్న ఒడిదుడుకులు తొందర్లోనే తొలగిపోతాయని స్పష్టం చేశారు. ఈ పరిస్థితులను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వివరించారు. జెన్ కో కేంద్రాలను అనాలోచితంగా మూసివేయలేదని పేర్కొన్నారు. బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే వేలం ద్వారా విద్యుత్ కొనుగోలు చేస్తున్నామని బాలినేని తెలిపారు.

బొగ్గు కొరత కారణంగా యూనిట్లను పూర్తిస్థాయిలో నడపలేని పరిస్థితి ఉందని, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు రాయలసీమ థర్మల్ ప్లాంట్ లో వార్షిక మరమ్మతులు చేపట్టామని వివరించారు. బొగ్గు కొరత వల్ల ఎలాగూ థర్మల్ యూనిట్లను మూసివేయాల్సి వచ్చేదని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రానికి బొగ్గు కొరత లేదని, అక్కడున్న బొగ్గు నిల్వలను ఏపీకి ఇవ్వడంలేదని మంత్రి బాలినేని స్పష్టం చేశారు. "మనం శ్రీశైలంలో మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేసుకోగలుగుతున్నాం. ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని మనవి చేస్తున్నా" అంటూ ట్విట్టర్ లో స్పందించారు.

Balineni Srinivasa Reddy
Fuel
Coal
Electricity
Andhra Pradesh
  • Loading...

More Telugu News