Bandla Ganesh: 'మా' ఎన్నికల్లో కీలక పరిణామం... నామినేషన్ వెనక్కి తీసుకున్న బండ్ల గణేశ్

  • ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి ఇటీవల బయటికొచ్చిన గణేశ్
  • జీవిత చేరికతో అసంతృప్తి
  • స్వతంత్ర అభ్యర్థిగా 'మా' ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ
  • ప్రకాశ్ రాజ్ తో చర్చల అనంతరం ఉపసంహరణ  
Bandla Ganesh withdraws his nomination from MAA Elections

టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 'మా' ఎన్నికల బరి నుంచి తప్పుకున్నట్టు ప్రకటించారు. ఇటీవల ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి బయటికి వచ్చిన బండ్ల గణేశ్ 'మా' ప్రధాన కార్యదర్శి పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు వెల్లడించారు. అయితే, తాజాగా చేసిన ప్రకటనలో తాను 'మా' ప్రధాన కార్యదర్శి పదవికి దాఖలు చేసిన నామినేషన్ ను ఉపసంహరించుకున్నానని స్పష్టం చేశారు.

ఇటీవల ప్రకాశ్ రాజ్ ప్యానెల్లో జీవిత చేరడంతో తీవ్ర అసంతృప్తికి గురైన బండ్ల గణేశ్ బాహాటంగానే తన మనోభావాలను వెలిబుచ్చారు. జీవితను ఓడించేందుకే ప్రధాన కార్యదర్శిగా పోటీ చేస్తున్నానని ప్రకటించారు.

కొన్నిరోజుల కిందట కూడా బండ్ల గణేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా వెనుక ఎవరెవరున్నారో మీకు తెలియదు... నా గెలుపు ఖాయం అంటూ వ్యాఖ్యలు చేశారు. అంతలోనే... నా దైవ సమానులు, నా ఆత్మీయులు, నా శ్రేయోభిలాషుల సూచన మేరకు జనరల్ సెక్రటరీ నామినేషన్ ను వెనక్కి తీసుకుంటున్నా అంటూ సోషల్ మీడియా ద్వారా నేడు వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆసక్తికర ఫొటోను పంచుకున్నారు. బండ్ల గణేశ్ తన నివాసంలో ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్ లతో కలిసి ఆ ఫొటోలో దర్శనమిచ్చారు. ప్రకాశ్ రాజ్ తో చర్చల అనంతరం బండ్ల గణేశ్ నామినేషన్ ఉపసంహరణ నిర్ణయం తీసుకున్నట్టు దీని ద్వారా తెలుస్తోంది.

More Telugu News