CM Jagan: తుపాను పరిస్థితులపై ఆరా తీసిన సీఎం జగన్

CM Jagan reviews cyclone situations in coastal area

  • బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం
  • తుపానుగా బలపడే అవకాశం
  • ఉత్తర కోస్తాంధ్ర-ఒడిశా తీరాల దిశగా పయనం
  • అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా బలపడిందని, ఇది తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) హెచ్చరించిన నేపథ్యంలో సీఎం జగన్ తుపాను పరిస్థితులపై ఆరా తీశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది సేవలు వాడుకోవాలని సూచించారు.

సచివాలయాల వారీగా కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశామని అధికారులు ఈ సందర్భంగా సీఎంకు తెలిపారు. ఉత్తరాంధ్రలో విపత్తు నిర్వహణ సిబ్బందిని సిద్ధం చేశామని వివరించారు. తుపాను తీరం దాటాక భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని, ఆ మేరకు తీర ప్రాంతాల్లో తగిన చర్యలు చేపట్టాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.

అటు, కోస్తాంధ్రకు తుపాను హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లను విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది. సముద్ర తీరప్రాంతాల్లో ఉండే మత్స్యకార కుటుంబాలను అప్రమత్తం చేయాలని ఆదేశించింది. తుపాను ప్రభావిత ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని తరలించారు. ఒడిశా, కోస్తాంధ్ర తీరంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.

తుపాను వల్ల ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో అలల తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. తీరం దాటే సమయంలో గాలులు, వర్షాలకు విద్యుత్ లైన్లు, వృక్షాలు, సెల్ టవర్లు కూలే ప్రమాదం ఉందని తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకుని వచ్చే ప్రమాదం ఉందని, ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. 

CM Jagan
Cyclone
North Andhra
Bay Of Bengal
  • Loading...

More Telugu News