Afghanistan: కాబూల్ లో ఎంబసీని ఖాళీ చేసిన ఇండియా.. స్పెషల్ ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్ ద్వారా సిబ్బంది తరలింపు

India evacuates Kabul Embassy and bringing back embassy staff
  • ఆఫ్ఘనిస్థాన్ లో దిగజారుతున్న పరిస్థితులు
  • ఎంబసీ సిబ్బందిని హుటాహుటిన స్వదేశానికి రప్పిస్తున్న భారత్
  • ఆఫ్ఘన్ లో చిక్కుకుపోయిన భారతీయుల కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు
ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న తర్వాత అక్కడి పరిస్థితుల భయానకంగా మారాయి. ఏం జరగబోతోందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. గతంలో మాదిరి కాకుండా, మంచి పాలన అందిస్తామని తాలిబన్ నేతలు చెపుతున్నప్పటికీ... వారి మాటలను ఆఫ్ఘన్ ప్రజలు కూడా నమ్మడం లేదు. భవిష్యత్తు పట్ల వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

పరిస్థితులు ప్రమాదకరంగా ఉండటంతో... కాబూల్ లోని ఎంబసీని ఇండియా ఖాళీ చేసింది. ఈ క్రమంలో భారత్ కు చెందిన స్పెషల్ ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్ కాబూల్ కు అత్యవసరంగా వెళ్లింది. ఈ ఫ్లైట్ ద్వారా ఆఫ్ఘన్ లోని భారత రాయబారి, ఇతర సిబ్బంది, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ట్రూపులను ఇండియాకు తీసుకొస్తున్నారు.

ఈ సందర్భంగా భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిదమ్ బగ్చి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... ఆప్ఘన్ లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో... అక్కడి మన రాయబారితో పాటు ఎంబసీ మొత్తం సిబ్బందిని తక్షణమే స్వదేశానికి రప్పించాలని నిర్ణయించామని తెలిపారు. ఆప్ఘన్ లో చిక్కుకుపోయిన భారతీయుల కోసం హెల్స్ లైన్ నంబర్ 919717785379ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.

కాబూల్ ఎయిర్ పోర్టులో నిన్న దారుణ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. వేలాది మంది ఎయిర్ పోర్టులోకి చొచ్చుకొచ్చి దేశం నుంచి బయటకు వెళ్లిపోయేందుకు యత్నించారు. ఈ సందర్భంగా వారిని నియంత్రించేందుకు అమెరికా సైన్యం కాల్పులు కూడా జరపాల్సి వచ్చింది. మరోవైపు ఈ ఉదయం నుంచి కాబూల్ ఎయిర్ పోర్టులో తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది.  

మరోవైపు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... ఆఫ్ఘన్ పరిణామాలపై అమెరికా విదేశాంగ మంత్రి ఆంటొనీ బ్లింకెన్ తో చర్చించానని తెలిపారు. కాబూల్ ఎయిర్ పోర్టులో కార్యకలాపాలు కొనసాగాల్సిన ఆవశ్యకతను వివరించామని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా చేస్తున్న కృషి చాలా గొప్పదని కితాబునిచ్చారు.
Afghanistan
Kabul
Embassy
Evacuation
Air Force
Jai Shankar
Help Line

More Telugu News