MIM: అఖిలేశ్​ పార్టీతో పొత్తు వ్యాఖ్యలను కొట్టిపారేసిన మజ్లిస్​

  • యూపీ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు లేదని స్పష్టీకరణ
  • 20% ఓట్లు ఆ పార్టీకే పడ్డాయని మాత్రమే చెప్పామని వెల్లడి
  • వంద సీట్లలో పోటీ చేస్తామని గతంలో ప్రకటించిన ఒవైసీ
MIM Condemns The Alliance With Samajwadi Party

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీతో పొత్తు వార్తలను అసదుద్దీన్ ఒవైసీ పార్టీ మజ్లిస్ (ఎంఐఎం) కొట్టిపారేసింది. తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవట్లేదని స్పష్టం చేసింది. డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇస్తే.. సమాజ్ వాదీ పార్టీతో పొత్తుకు సిద్ధమని వచ్చిన వార్తలను ఖండించింది.

‘‘ముస్లింను అఖిలేశ్ యాదవ్ ఉప ముఖ్యమంత్రిని చేస్తే సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుంటామని మేం ఎప్పుడూ చెప్పలేదు. నేను గానీ.. పార్టీ అధినేత అసదుద్దీన్ గానీ ఆ వ్యాఖ్యలు చేయలేదు. అంతకుముందు జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలోని 20 శాతం ముస్లిం ఓట్లు ఎస్పీకే పడ్డాయని మాత్రమే మేం చెప్పాం. అన్ని ఓట్లు పడినా అధికారంలోకి వచ్చాక ముస్లింను ఉప ముఖ్యమంత్రిని చేయలేదని అన్నాం’’ అని ఎంఐఎం యూపీ అధ్యక్షుడు షౌకత్ అలీ వివరణ ఇచ్చారు.

కాగా, యూపీలోని వంద సీట్లలో పోటీ చేస్తామంటూ గతంలో అసదుద్దీన్ ప్రకటించారు. రాష్ట్రంలోని 110 నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు 30 నుంచి 39 శాతం దాకా ఉన్నారు. అందులోని 44 చోట్ల 40 నుంచి 49 శాతం ముస్లిం ఓటర్లున్నారు. 11 స్థానాల్లో 50 నుంచి 65 శాతం మంది ఉన్నారు. ఇప్పటికే అసదుద్దీన్ ఒవైసీ అక్కడి చిన్న చిన్న రాజకీయ పార్టీలను ఏకం చేసే పనిలో ఉన్నారు.

గత ఎన్నికల్లో బీజేపీ 312 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. 403 నియోజకవర్గాలలో మెజారిటీ స్థానాలను గెలిచింది. 39.67 శాతం ఓట్లను పొందింది. సమాజ్ వాదీ పార్టీ 47, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ 19, కాంగ్రెస్ 7 సీట్లను మాత్రమే గెలిచాయి.

More Telugu News