Dainik Bhaskar: రూ.700 కోట్ల ఆదాయంపై పన్ను ఎగవేసిన దైనిక్​ భాస్కర్​: ఆదాయ పన్ను శాఖ

Dainik Bhaskar Evaded Taxes On Rs 700 cr Income
  • లాభాలను దారి మళ్లించారని వెల్లడి
  • ప్రకటనల కోసం డబ్బుకు బదులు స్థిరాస్తులు
  • వేరే వ్యాపారాల ద్వారా మరో 2,200 కోట్ల ఆర్జన

ఆరేళ్లలో వచ్చిన రూ.700 కోట్ల ఆదాయంపై దైనిక్ భాస్కర్ పన్నులను చెల్లించలేదని, అది స్టాక్ మార్కెట్ నిబంధనల ఉల్లంఘనేనని ఆదాయపన్ను శాఖ అధికారులు వెల్లడించారు. లిస్టెడ్ సంస్థల నుంచి లాభాలనూ దారి మళ్లించారనేందుకు ఆధారాలున్నాయని చెప్పారు. ఉద్యోగుల పేర్ల మీద వివిధ సంస్థలను నడుపుతున్నట్టు తమ సోదాల్లో తేలిందన్నారు. ఆయా సంస్థల ద్వారానే బోగస్ ఖర్చులను చూపించి నిధులను మళ్లించారని చెప్పారు.

ఆయా సంస్థలకు షేర్ హోల్డర్లు, డైరెక్టర్లుగా దైనిక్ భాస్కర్ పేర్కొన్న పలువురు ఉద్యోగులు.. అసలు వాటి గురించే తమకు తెలియదని చెప్పారన్నారు. లిస్టెడ్ సంస్థల లాభాలను మళ్లించి, ఖర్చులుగా చూపించి పన్నులను ఎగవేసేందుకే ఇలాంటి సంస్థలను ఏర్పాటు చేశారన్నారు.

ఈ ఆరేళ్లలో ఈ బోగస్ సంస్థల ద్వారా రూ.700 కోట్ల ఆర్జనపై పన్నులను దైనిక్ భాస్కర్ ఎగవేసిందని ఆదాయ పన్ను శాఖ అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుండడం, తవ్వే కొద్దీ మరిన్ని విషయాలు వెలుగు చూస్తుండడంతో పన్ను ఎగవేతలు చాలానే ఉండొచ్చని చెప్పారు. సంస్థ ప్రమోటర్లు, కీలక ఉద్యోగుల ఇళ్లలో 26 లాకర్లకు సంబంధించిన తాళాలను స్వాధీనం చేసుకున్నామన్నారు.

ప్రకటనలకు డబ్బుల రూపంలో కాకుండా భూముల రూపంలో ఒప్పందం చేసుకునేదని చెప్పారు. ఆ భూముల కొనుగోళ్లకు సంబంధించిన రశీదులను స్వాధీనం చేసుకున్నామన్నారు. మీడియా వ్యాపారం కాకుండా వేరే వ్యాపార మార్గాల్లో సంస్థ రూ.2,200 కోట్లను వెనకేసిందని చెప్పారు. ఎలాంటి కదలికలు, సరుకుల సరఫరా వంటివి లేకుండానే ఈ లావాదేవీలు జరిగాయని చెప్పారు.

  • Loading...

More Telugu News