Congress: మా పార్టీ నాయకత్వాన్ని క్రమబద్ధీకరించాల్సి ఉంది: జైరాం రమేశ్‌

JaiRam Ramesh wants party leadership to be in order
  • సొంత పార్టీపై జైరాం కీలక వ్యాఖ్యలు
  • 2014, 2019లో ఘోరంగా ఓడామని వ్యాఖ్య
  • ఇప్పటికైనా పార్టీని క్రమంలో పెట్టాలని హితవు
  • సముచిత స్థానం ఇచ్చినా కొంతమంది పార్టీని వీడారని వ్యాఖ్య
  • సచిన్‌ పైలట్‌కు పార్టీలో మంచి భవిష్యత్తు ఉందని జోస్యం
సొంత పార్టీ తీరుపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నాయకత్వాన్ని క్రమబద్ధీకరించాల్సి ఉందన్నారు. అలాగే పార్టీ ఉనికిని మరింత విస్తృతం చేయాలన్నారు. 2014, 2019 ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమి చవిచూసిందన్నారు. ఇప్పటికైనా పార్టీని ఓ క్రమంలో పెట్టాలని హితవు పలికారు. అలాగే ప్రజల్లోకి పంపే సందేశం సైతం ఓ క్రమ పద్ధతిలో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీలో ఏ ఒక్క నాయకుడి వద్దనో మంత్రదండం ఉండదని.. అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సి ఉంటుందన్నారు. ప్రముఖ జాతీయ మీడియా ఛానెల్‌ ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల పార్టీ వీడినవారి గురించి మాట్లాడుతూ.. పార్టీని వదిలివెళ్లిన యువ నాయకులు పుట్టుకతోనే ప్రత్యేక అవకాశాల్ని పుణికిపుచ్చుకున్నారన్నారు. పార్టీలో వారికి సముచిత స్థానం దక్కిందన్నారు. పార్టీని వీడిన ప్రతి ‘సింధియా’ స్థానంలో పార్టీ కోసం పోరాడే వేలాది మంది కార్యకర్తలు ఉన్నారని వ్యాఖ్యానించారు. జ్యోతిరాధిత్య సింధియా కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. వీరిపై ఒకప్పుడు బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిందని.. ఇప్పుడు అదే పార్టీ వారిని చేర్చుకుంటోందన్నారు. తమ పార్టీకి ఒక క్రమశిక్షణ ఉందని.. ఇష్టం వచ్చినట్లు వెళ్లి రావడం కుదరదని పేర్కొన్నారు.

ఇక కాంగ్రెస్‌ని వీడుతారంటూ ఊహాగానాలు వస్తున్న మరో నాయకుడు సచిన్‌ పైలట్‌పై జైరాం ప్రశంసలు కురిపించారు. పైలట్‌ పార్టీకి గొప్ప ఆస్తి అని.. అతనికి పార్టీలో గొప్ప భవిష్యత్తు ఉంటుందన్నారు. గత ఏడాది సచిన్‌ పైలట్‌ పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన విషయం తెలిసిందే. చివరకు అధిష్ఠానం ఆయన డిమాండ్లకు ఒప్పుకోవడంతో వెనక్కి తగ్గారు. కానీ, ఇప్పటి వరకు ఆ డిమాండ్లను నెరవేర్చలేదని.. ఈ విషయంపై ఇటీవలే ఆయన ఢిల్లీ వెళ్లారని వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో జైరాం ఆయనపై ప్రశంసలు కురిపించడం గమనార్హం.
Congress
Jairam Ramesh
Sachin pilot
BJP

More Telugu News