Congress: రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని నిలబెట్టినందుకు మంత్రి పదవులు ఆశిస్తున్న బీఎస్పీ ఎమ్మెల్యేలు

Congress high command should not listen to Sachin Pilot camp says BSP defectors

  • సచిన్ వర్గం తిరుగుబాటు తర్వాత ఆదుకున్న బీఎస్పీ ఎమ్మెల్యేలు
  • మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో పదవులపై ఆశ
  • సచిన్ వర్గ ఎమ్మెల్యే డిమాండ్లు పట్టించుకోవలసిన అవసరం లేదన్న నేతలు
  • సచిన్ కూడా గెహ్లాత్‌నే నాయకుడిగా పరిగణించాలన్న ఆయన వర్గ ఎమ్మెల్యే

రాజస్థాన్‌లో సచిన్ పైలట్ వర్గం తిరుగుబాటుతో ప్రమాదంలో పడిన అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని ఆదుకున్న బీఎస్పీ ఎమ్మెల్యేలు ఇప్పుడు మంత్రి పదవులు ఆశిస్తున్నారు. సచిన్ పైలట్ తిరుగుబాటు తర్వాత ఏర్పడిన రాజకీయ సంక్షోభానికి బీఎస్పీ ఎమ్మెల్యేలు ఆరుగురు కాంగ్రెస్‌లో చేరడంతో ఫుల్‌స్టాప్ పడింది.

ఇప్పుడు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కేబినెట్‌ను విస్తరిస్తున్నట్టు సంకేతాలు రావడంతో వీరంతా ప్రతిఫలాన్ని ఆశిస్తూ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. పైలట్ వర్గంతో కాంగ్రెస్ అధిష్ఠానం చర్చలు జరపడాన్ని వారు తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వాన్ని సంక్షోభంలోకి నెట్టిన వారి డిమాండ్లు వినాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.

గెహ్లాట్ నాయకత్వంపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందని, తమకు ఇప్పటికైనా తగిన ప్రతిఫలం, గౌరవం దక్కాలని కోరారు. కాగా, గెహ్లోట్ కేబినెట్‌లో 9 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. వీటి కోసం మొత్తం 25 మంది ఎమ్మెల్యేలు ఎదురుచూస్తున్నారు. వీరిలో బీఎస్పీ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఆరుగురు ఎమ్మెల్యేలతోపాటు సచిన్ వర్గంలోని ఎమ్మెల్యేలు, స్వతంత్ర ఆశావహులు ఉన్నారు.

సచిన్ పైలట్ తమ నాయకుడే అయినా ఆయన కంటే గెహ్లోటే పెద్ద నేత అని సచిన్ వర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి భన్వర్‌లాల్ చెప్పడం గమనార్హం. సీఎంపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. అంతేకాదు, సచిన్ కూడా గెహ్లోట్ ‌ను నాయకుడిగా పరిగణించాలని భన్వర్‌లాల్ సూచించారు.

Congress
BSP
Rajasthan
Ashok Gehlot
Sachin Pilot
  • Loading...

More Telugu News