Chiranjeevi: టాలీవుడ్ నటి పావలా శ్యామలకు చిరంజీవి ఆర్థికసాయం

  • తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పావలా శ్యామల
  • ఇంటి అద్దె కూడా కట్టలేని స్థితిలో సీనియర్ నటి
  • 'మా'లో సభ్యత్వం ఇప్పిస్తున్న చిరంజీవి
  • ఇక ప్రతి నెలా ఆమెకు 'మా' నుంచి రూ.6 వేల పెన్షన్ 
  • గతంలో రూ.2 లక్షలు అందించిన మెగాస్టార్
Chiranjeevi helps Pavala Shyamala

టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామల తీవ్ర ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి చలించిపోయారు. వెంటనే ఆమెకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లో సభ్యత్వం ఇప్పించే నిమిత్తం రూ.1,01,500 మొత్తానికి చెక్కును తన ప్రతినిధుల ద్వారా పంపించారు. 'మా'లో సభ్యత్వం వల్ల ఇక ఆమెకు ప్రతి నెలా అసోసియేషన్ నుంచి రూ.6000 పెన్షన్ లభిస్తుంది.

ఈ విధంగా చిరంజీవి ఏర్పాటు చేయడంతో పావలా శ్యామల సంతోషంతో మెగాస్టార్ కు కృతజ్ఞతలు తెలిపారు. గతంలోనూ తనకు చిరంజీవి రూ.2 లక్షల ఆర్థికసాయం చేశారని ఆమె చెప్పారు. తనకు ఇంతటి సహాయం చేసిన చిరంజీవికి జీవితాంతం రుణపడి ఉంటానని ఆమె పేర్కొన్నారు.

దాదాపు 250కి పైగా చిత్రాల్లో నటించిన శ్యామల ప్రస్తుతం ఇంటి అద్దె కూడా కట్టలేని స్థితిలో ఉన్నారు. తన అనారోగ్యంతో పాటు, కుమార్తె అనారోగ్యంతోనూ ఆమె సతమతమవుతున్నారు. అప్పట్లో చిరంజీవి కృషి చేయడంతో తనకు తెలంగాణ ప్రభుత్వం నుంచి రూ.10 వేల పింఛను వచ్చేదని, ఇప్పుడది రావడంలేదని పావలా శ్యామల వాపోయారు. కాగా, శ్యామలకు సీనియర్ దర్శకుడు శివనాగేశ్వరరావు రూ.50 వేలు అందించారు.

More Telugu News