Miss Universe: విశ్వసుందరిగా మెక్సికో అందాల భామ ఎంపిక

Mexico Beauty Andrea Meza Crowned Miss Universe 2020

  • 26 ఏళ్ల ఆండ్రియా మేజాకు కిరీటం
  • రన్నరప్ గా మిస్ బ్రెజిల్ జూలియా గామా
  • నాలుగో స్థానంలో భారత్ నుంచి ఏడ్లిన్ కేస్టలీనో 
  • కరోనాతో ఏడాది ఆలస్యంగా పోటీలు

విశ్వ సుందరి కిరీటం ఈసారి మెక్సికోను వరించింది. మిస్ యూనివర్స్ 2020గా మిస్ మెక్సికో యాండ్రియా మేజా జయకేతనం ఎగురవేసింది. మాజీ విశ్వ సుందరి జోజిబినీ టుంజీ (దక్షిణాఫ్రికా).. ఆమెకు కిరీటాన్ని అలంకరించింది. ఆదివారం రాత్రి అమెరికాలోని ఫ్లోరిడాలో విశ్వ సుందరి గ్రాండ్ ఫినాలె జరిగింది.

అందాల పోటీల నిర్వాహకులు ఆమెను కరోనాపై ప్రశ్నను సంధించారు. ‘‘నువ్వే మీ దేశానికి నాయకురాలివైతే కరోనా మహమ్మారిని ఎలా ఎదుర్కొనేదానివి?’’ అనే ప్రశ్న అడిగారు. దానికి ఆమె సూటిగా ‘లాక్ డౌన్’ పెట్టేదాన్నంటూ సమాధానమిచ్చింది.

‘‘కరోనా మహమ్మారి లాంటి అతి క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొనేందుకు కచ్చితమైన పరిష్కారమంటూ లేదని నేననుకుంటున్నాను. కరోనాను ఎదుర్కోవాల్సి వస్తే నేను లాక్ డౌన్ పెట్టేదాన్ని. ప్రాణాలు పోకముందే ఆ నిర్ణయాన్ని తీసుకునేదాన్ని. ఇప్పటికే మేం చాలా మందిని కోల్పోయాం. లాక్ డౌన్ ను మేం తట్టుకోలేమనే విషయం తెలుసు. కానీ, ప్రజల రక్షణకే ప్రాధాన్యం ఇవ్వాలి. కాబట్టి ముందు నుంచీ నేను ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతూనే ఉన్నాను’’ అని ఆండ్రియా చెప్పుకొచ్చింది.

భారత్ తరఫున బరిలో నిలిచిన ఏడ్లిన్ కేస్టలీనో నాలుగో స్థానంలో నిలిచింది. విశ్వ సుందరి రన్నరప్ గా మిస్ బ్రెజిల్ జూలియా గామా, రెండో రన్నరప్ గా మిస్ పెరూ జానిక్ మాచెటా డెల్ కాస్టిలో నిలిచారు. మొత్తంగా మిస్ యూనివర్స్ పోటీల్లో 73 మంది సుందరాంగులు తమ అందచందాలతో పోటీ పడ్డారు. వాస్తవానికి గత ఏడాదే జరగాల్సిన మిస్ యూనివర్స్ పోటీలు కరోనా కారణంగా ఏడాది పాటు వాయిదా పడ్డాయి.

ఎవరీ ఆండ్రియా?

ఆండ్రియా మేజా సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది. మహిళా హక్కుల కోసం పోరాడుతోంది. మహిళా హక్కుల కోసం ఏర్పాటు చేసిన మున్సిపల్ ఇనిస్టిట్యూట్ ఫర్ విమెన్ తరఫునా పనిచేస్తోంది. అంతేకాదు.. సర్టిఫైడ్ మేకప్ ఆర్టిస్ట్ , మోడల్ కూడా. క్రీడలంటే అమితమైన ఇష్టం. చువావా నగర పర్యాటక రంగ బ్రాండ్ అంబాసిడర్.

Miss Universe
USA
Miss Mexico
Miss India Diva
India
Andrea Meza
Adline Castelino
  • Loading...

More Telugu News