Narendra Modi: ప్రధాని మోదీ 'మన్ కీ బాత్' లో విజయవాడ ప్రొఫెసర్ గురించి ప్రస్తావన

PM Modi mentions Vijayawada professor Srinivas in his Mann Ki Baat speech

  • 'మన్ కీ బాత్' లో ప్రధాని మోదీ ప్రసంగం
  • స్ఫూర్తిదాయక వ్యక్తుల గురించి వివరణ
  • శ్రీనివాస్ తుక్కుతో కళాకృతులు రూపొందిస్తున్నట్టు వెల్లడి
  • శ్రీనివాస్ కు ప్రశంసలు తెలిపిన వైనం

ప్రధాని నరేంద్ర మోదీ తన 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పలువురు వ్యక్తుల గురించి ప్రస్తావన తీసుకువచ్చి ప్రజల్లో స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశారు. మనం చేసే ప్రయత్నాలకు తోడుగా సమాజాన్ని కూడా తీసుకెళితే ఎంతో పెద్ద ఫలితాలు వస్తాయని వివరించారు.

ఏపీలో విజయవాడకు చెందిన ప్రొఫెసర్ శ్రీనివాస్ పదకండ్ల ఎంతో వినూత్నమైన ఆలోచనలతో ముందుకెళుతున్నారని తెలిపారు. శ్రీనివాస్ ఎంతో ఆసక్తికరమైన పనిచేస్తున్నారని, ఆటోమొబైల్ లోహాల తుక్కుతో ఆకర్షణీయమైన శిల్పాలు రూపొందిస్తున్నారని వెల్లడించారు. ఆయన రూపొందించిన భారీ కళాకృతులను పబ్లిక్ గార్డెన్స్ లో ఏర్పాటు చేస్తున్నారని వివరించారు. శ్రీనివాస్ ప్రయత్నాలను తాను ప్రశంసిస్తున్నానని ప్రధాని మోదీ తెలిపారు.

ఇక, తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన మరిముత్తు యోగనాథన్ ఓ బస్సు కండక్టర్ అని, ఆయన తన బస్సులో టికెట్లతో పాటు ప్రయాణికులకు ఉచితంగా మొక్కలను కూడా అందజేస్తారని ప్రధాని వెల్లడించారు. ఆ విధంగా యోగనాథన్ లెక్కలేనన్ని మొక్కలను నాటినట్టయిందని వివరించారు. ఆయన తన వేతనంలో అధిక భాగాన్ని ఈ మొక్కల పంపిణీ కోసం వెచ్చిస్తున్నారని తెలిపారు. ఇది విన్న తర్వాత ఎవరైనా యోగనాథన్ ను ప్రశంసించకుండా ఉంటారా? అని ప్రశ్నించారు. ఇలాంటి అంశాలను ప్రజలు ఎంతో ఉత్సాహంగా గమనిస్తున్నారని పేర్కొన్నారు.

Narendra Modi
Mann Ki Baat
Srinivas Padakandla
Scrap
Sculpture
Vijayawada
  • Loading...

More Telugu News