Student: పంజాగుట్టకు చెందిన ఓ విద్యార్థి ఇలా మోసపోయాడు!

Student got cheated by cyber criminals
  • అమ్మాయి పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్
  • యాక్సెప్ట్ చేసిన విద్యార్థి
  • అర్ధనగ్న చాటింగ్ లు, ప్రైవేటు వీడియోలతో రెచ్చిపోయిన విద్యార్థి
  • ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసిన అవతలి వ్యక్తి
సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్ ఫొటోలతో మోసగించడం ఇటీవల కాలంలో బాగా ఎక్కువైంది. అమ్మాయి ఫొటోలు పెట్టి పురుషులను ఆకర్షిస్తూ సైబర్ నేరగాళ్లు తమ పబ్బం గడుపుకుంటున్నారు. అవతల తమతో చాటింగ్ చేస్తున్నది నిజంగా అమ్మాయేనని భావించి, డబ్బు, ఇతరత్రా మోసపోతూ పోలీసులను ఆశ్రయించడం పరిపాటిగా మారింది. తాజాగా హైదరాబాదులోని పంజాగుట్టకు చెందిన ఓ విద్యార్థి (20) కూడా సైబర్ నేరగాళ్ల చేతిలో చిత్తయ్యాడు.

ఆ విద్యార్థికి గతేడాది సోషల్ మీడియాలో ఓ అమ్మాయి ఫ్రొఫైల్ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. అమ్మాయే అనుకుని ఆ విద్యార్థి మరింత ముందుకు పోయాడు. చాటింగ్  నుంచి ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకునే వరకు వెళ్లింది. అవతలి వ్యక్తి కాస్తంత శృంగారభరితమైన సంభాషణలకు దిగడంతో సదరు విద్యార్థి మరింత రెచ్చిపోయాడు. తన అర్ధనగ్న ఫొటోలు, ప్రైవేటు వీడియోలను పంచుకున్నాడు. అయితే, అక్కడ్నించి అతడికి బెదిరింపులు మొదలయ్యాయి.

ఆ ఫొటోలు, ప్రైవేటు వీడియోలను ఆధారంగా చేసుకుని అవతలి వ్యక్తి డబ్బు డిమాండ్ చేయడంతో విద్యార్థికి విషయం అర్థమైంది. ఆ తర్వాత ఏకంగా తన వీడియో లింకును ఓ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఆ విద్యార్థి బెంబేలెత్తిపోయాడు. అవతలి వ్యక్తి మొదట రూ.50 వేలు డిమాండ్ చేయగా, చివరికి రూ.25 వేలు చెల్లించేందుకు వారిని ఒప్పించాడు.

వారు చెప్పిన ఖాతాలో ఆ నగదు డిపాజిట్ చేయగా, కొన్నిరోజులకే మళ్లీ బెదిరింపులు షురూ అయ్యాయి. దాంతో ఆ విద్యార్థి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Student
Cheating
Cyber Criminals
Police
Punjagutta
Hyderabad

More Telugu News