Prime Minister: కాంగ్రెస్​ అంటేనే.. అబద్ధాలు, అవినీతి, అయోమయ పార్టీ: ప్రధాని నరేంద్ర మోదీ

Congress Means Lies Confusion Corruption fumes PM Modi
  • అధికారం కోసం ఎంతకైనా దిగజారుతుందని కామెంట్
  • ఆ పార్టీ ఖజానా ఖాళీ అయిందని ఎద్దేవా
  • వాటిని నింపుకునేందుకు తహతహలాడుతోందని విమర్శ
  • అసోంలోని బోకాఖత్ లో ప్రధాని ఎన్నికల ప్రచార సభ
కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. అసోం విషయంలో ఆ పార్టీ అన్నీ బూటకపు హామీలు ఇస్తోందని మండిపడ్డారు. అటు కేంద్రంలో, ఇటు అసోంలో ఆ పార్టీ అధికారంలో ఉండగా.. భద్రత, స్థిరత్వం విషయంలో విఫలమైందన్నారు. ఆదివారం అసోంలోని బోకాఖత్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు.

అధికారం కోసం ఆ పార్టీ ఎంత నీచానికైనా దిగజారుతుందని మోదీ విమర్శించారు. అబద్ధపు హామీలు ఇచ్చేందుకూ వెనకాడదన్నారు. అందుకు ఆ పార్టీ మేనిఫెస్టోనే ఉదాహరణ అని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో అసోం రెట్టింపు నిర్లక్ష్యానికి గురైందన్నారు. రాష్ట్రంలో అవినీతి రెట్టింపైందని, చొరబాట్లు రెట్టింపయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీ అంటేనే ‘అబద్ధాలు.. అయోమయం.. అవినీతి.. హింసాత్మక’ పార్టీ అని మండిపడ్డారు. మహిళా సాధికారత, ఉద్యోగాల కల్పన విషయంలో ఆ పార్టీ చెప్పేవన్నీ అబద్ధాలేనన్నారు. రెండు ఇంజన్ల ఎన్డీయే ప్రభుత్వం అసోం అభివృద్ధికి శతవిధాలా కృషి చేసిందని మోదీ చెప్పారు. దేశంతో అసోంను కలిపిందన్నారు. ఎన్నో అభివృద్ధి పనులను చేసిందన్నారు. మరో ఐదేళ్లలో అభివృద్ధిలో అసోం దూసుకుపోతుందని హామీ ఇచ్చారు.

ప్రస్తుతం ఆ పార్టీ ఖజానా ఖాళీ అయిందని, దానిని నింపుకోవడం కోసం మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఆరాట పడుతోందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అసోంలో బాంబు పేలుళ్లు, తుపాకుల సంస్కృతి, హింస ఎప్పుడు అంతమవుతుందో అని ప్రజలు అనుకునేవారని మోదీ గుర్తు చేశారు. అదంతా బీజేపీ హయాంలోనే సాధ్యమైందన్నారు. ప్రస్తుతం అసోంలో శాంతి, స్థిరత్వం వచ్చిందన్నారు.

స్మగ్లర్లకు కాంగ్రెస్ కొమ్ముకాసిందని మోదీ విమర్శించారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చాక రైనోల స్మగ్లింగ్ ను అడ్డుకుందని చెప్పారు. స్మగ్లర్లను జైల్లో పెట్టామన్నారు. ఆక్రమణదారుల చెర నుంచి కజిరంగ పార్కును రక్షించామన్నారు.
Prime Minister
Narendra Modi
BJP
Assom
Congress

More Telugu News