Johnson and Johnson: జాన్సన్ అండ్ జాన్సన్ 'ఒకే డోసు' వ్యాక్సిన్ కు అమెరికా అనుమతి!

US Aproved Johnsons Vacine which is Highly Effective on Corona
  • అత్యవసర వినియోగానికి అనుమతి
  • మిగతా వ్యాక్సిన్ లతో పోలిస్తే మెరుగైన పనితీరు
  • జూన్ నాటికి 10 కోట్ల డోస్ లు
జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ ను అత్యవసర వినియోగానికి అనుమతి ఇస్తూ, అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ లను రెండు డోస్ లుగా ఇవ్వాల్సి వుండగా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ మాత్రం ఒక్క డోస్ వ్యాక్సిన్ మాత్రమే. అమెరికాలో కరోనా మహమ్మారి కారణంగా 5 లక్షల మందికి పైగా మృత్యువాత పడగా, మూడో వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రావడంతో సాధ్యమైనంత త్వరగా దేశ ప్రజలందరికీ టీకాను పంచేందుకు ఎఫ్డీయే ఏర్పాట్లు చేస్తోంది.

ఇక ఈ వ్యాక్సిన్ కరోనా కొత్త స్ట్రెయిన్ల మీద కూడా సమర్ధవంతంగా పని చేస్తున్నట్టు తేలింది. "ఇదొక ఆనందకరమైన వార్త. కరోనాను పారద్రోలేందుకు మనం చేస్తున్న పోరాటం ఇంకో మెట్టు ఎక్కింది" అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఓ ప్రకటనలో వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో అమెరికన్లు వైరస్ వ్యాప్తి పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రొటోకాల్ నిబంధనలను ఉల్లంఘించవద్దని, జనసమ్మర్ధం ఉన్న ప్రాంతాలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలని సూచించారు. మాస్క్ ధరించకుండా ఉండవద్దని అన్నారు. కరోనాపై పూర్తిగా విజయం సాధించేంత వరకూ జాగ్రత్తలు తీసుకుంటూనే ఉండాలని అన్నారు.

కాగా, జాన్సన్ అండ్ జాన్సన్ తయారు చేసిన టీకా యూఎస్ లో 85.9 శాతం, సౌతాఫ్రికాలో 81.7 శాతం, బ్రెజిల్ లో 87.6 శాతం ప్రభావవంతమైనదని రుజువైంది. అన్ని రీజియన్లలో కలిపి 39,321 మంది వాలంటీర్లకు టీకాను ఇచ్చి, వారిలో పెరిగిన యాంటీ బాడీలను పరిశీలించారు.

ఇక, మార్చి చివరికి 2 కోట్ల డోస్ లను, జూన్ నాటికి 10 కోట్ల డోస్ ల వ్యాక్సిన్ ను ప్రపంచానికి అందిస్తామని జాన్సన్ అండ్ జాన్సన్ పేర్కొంది. అమెరికాలో ఇప్పటివరకూ 6.5 కోట్ల మందికి వ్యాక్సిన్ అందింది. దాదాపుగా మరో 25 కోట్ల మందికి టీకా అందాల్సి వుంది.

ఇదిలావుండగా, ఇప్పుడు అందుబాటులో ఉన్న రెండు వ్యాక్సిన్లూ, కరోనా కొత్త స్ట్రెయిన్ లు వెలుగుచూడక ముందు పరిశీలించినవని, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ కొత్త స్ట్రెయిన్ లు వచ్చిన తరువాత ట్రయల్స్ జరుపుకుందని మైనీ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ విభాగం అధికారి నీరవ్ షా, 'ది వాషింగ్టన్ పోస్ట్' కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. కొత్త కరోనా రకాల పైనా ఇది పని చేస్తున్నట్టుగా తేలిందని అన్నారు.

Johnson and Johnson
J&J
Vaccine
Single Dose
USA
FDA

More Telugu News