Manipur: నాగాలాండ్, మణిపూర్ సరిహద్దుల్లో భారీ కార్చిచ్చు!

Massive wildfire engulfs large parts of Dzuko valley on Nagaland Manipur border
  • నాగాలాండ్ జూకో లోయలో మొదలైన మంటలు
  • మణిపూర్ మౌంట్ ఇసో వరకూ వ్యాప్తి
  • పెద్ద సంఖ్యలో వృక్ష, జంతు జాతులకు నష్టం
  • ఎన్డీఆర్ఎఫ్ సాయం కోరిన మణిపూర్ ప్రభుత్వం
  • గత నెల 28 నుంచి మంటలు
నాగాలాండ్, మణిపూర్ సరిహద్దుల్లో భారీ కార్చిచ్చు చెలరేగింది. వందలాది ఎకరాల్లో అడవులను కాల్చి బుగ్గి చేస్తోంది. కొన్ని రోజుల క్రితం నాగాలాండ్ లోని జూకో లోయలో అంటుకున్న మంటలు.. నెమ్మదిగా మణిపూర్ వరకు విస్తరించాయి. దాదాపు మౌంట్ ఇసో వరకు వ్యాపించాయి. దీంతో మంటలను అదుపు చేసేందుకు జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) సాయం కోరింది మణిపూర్ ప్రభుత్వం.

దాంతో పాటు సైన్యం, పారామిలటరీ బలగాల సాయమూ కోరినట్టు అధికారులు చెబుతున్నారు. నాగాలాండ్ వైపే కార్చిచ్చు చెలరేగిందని మణిపూర్ లోని సేనాపతి జిల్లా అటవీ అధికారి చెప్పారు. గత నెల 28 నుంచి అడవి మండుతూనే ఉన్నట్టు సరిహద్దు గ్రామాల ప్రజల ద్వారా తెలుస్తోందని ఆయన చెప్పారు.

ప్రస్తుతం ఆయా గ్రామాల్లోని 130 మంది ప్రజలు, అటవీ అధికారులు కలిసి మంటలను ఆర్పే ప్రయత్నం చేశామని చెప్పారు. అయితే, గాలుల వేగం, తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆటంకాలు ఏర్పడ్డాయన్నారు. కార్చిచ్చుల వల్ల చాలా వరకు వృక్ష, జంతు జాతులు బుగ్గయ్యాయని మణిపూర్ మావో మండలి పేర్కొంది. మంటలకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

పరిస్థితి తీవ్రమవుతుండడంతో మణిపూర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కలిసి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ అక్కడ ఏరియల్ సర్వే నిర్వహించారు. మంటలు ఆర్పేందుకు 200 మంది అగ్నిమాపక సిబ్బందితో పాటు, ప్రథమ స్పందన బృందాలను రంగంలోకి దించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా కార్చిచ్చు పరిస్థితిపై ఆరా తీసినట్టు తెలుస్తోంది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అవసరమైన సాయం చేస్తామంటూ అమిత్ షా ప్రకటించారని బిరేన్ సింగ్ చెప్పారు.
Manipur
Nagaland
Biren Singh
Wild Fire
Mt Iso
Dzuko Valley
Amit Shah

More Telugu News