Computer Baba: భూకబ్జాలకు తెగబడిన 'కంప్యూటర్ బాబా'కు అరదండాలు!

Madhya Pradesh police arrests Computer Baba

  • మధ్యప్రదేశ్ లో కంప్యూటర్ బాబాగా ఫేమస్ అయిన నామ్ దేవ్ త్యాగి
  • ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్టు ఆరోపణలు
  • అక్రమ నిర్మాణాల కూల్చివేతను అడ్డుకున్న బాబా
  • అరెస్ట్ చేసి జైలుకు తరలించిన పోలీసులు

మధ్యప్రదేశ్ లో కంప్యూటర్ బాబా అంటే ఎంతో ఫేమస్. ఆయన అసలు పేరు నామ్ దేవ్ దాస్ త్యాగి. ఆయనకు మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్, శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వాలు మంత్రి హోదా కల్పించాయి. విధి వికటించడంతో ఇప్పుడాయన జైలు పాలయ్యారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టారన్న ఆరోపణలు ఆయనపై వచ్చాయి. దాంతో ప్రభుత్వం అక్రమ నిర్మాణాలు కూల్చివేసేందుకు ప్రయత్నించగా, ఈ కంప్యూటర్ బాబా తన అనుచరులతో కలిసి నిరసనకు దిగడంతో ఆయనను అరెస్ట్ చేశారు. ఇండోర్ లోని హతోడ్ ప్రాంతంలో ఉన్న ఆయన ఆశ్రమాన్ని మూసివేశారు.

దీనిపై ఇండోర్ డీఐజీ హరినారాయణచారి మిశ్రా స్పందిస్తూ, పోలీసులు సెక్షన్ 151 (సీఆర్పీసీ) కింద కంప్యూటర్ బాబాతో పాటు మరో ఆరుగురిని అరెస్ట్ చేశారని వెల్లడించారు. వారిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ఆపై వారిని సెంట్రల్ జైలుకు తరలించినట్టు వివరించారు. ఇండోర్ కలెక్టర్ మనీశ్ సింగ్ మాట్లాడుతూ, ప్రభుత్వ అధికారుల చర్యలకు అడ్డుతగలడంతో వారిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు.

కాగా ఆశ్రమంలో అరెస్టుల సందర్భంగా పోలీసులు ఓ 315 బోర్ గన్, ఒక ఎయిర్ గన్, ఒక పిస్టల్, ఒక కృపాణం, ఏసీలు, ఫ్రిజ్ లు, టెలివిజన్ లు ఉన్నట్టు గుర్తించారు. వాటితో పాటు రెండు కార్లు, రెండు బైకులను సీజ్ చేశారు.

Computer Baba
Arrest
Indore
Madhya Pradesh
  • Loading...

More Telugu News