USA: హెచ్1బీ వీసాల జారీలో ట్రంప్ సర్కారు మరో ఎత్తుగడ... లాటరీ పధ్ధతి ఎత్తివేత.. వేతన స్థాయి ఆధారంగా వీసాలు!

US proposes to remove lottery system to issues visas
  • అమెరికన్ల ఉపాధి కోసం ట్రంప్ సర్కారు సరికొత్త వ్యూహం
  • అధిక వేతనం ఉన్నవారికి వీసాల జారీలో ప్రాధాన్యత
  • నోటిఫికేషన్ జారీ చేసిన అమెరికా హోంమంత్రిత్వ శాఖ
విదేశీ నిపుణులకు హెచ్1బీ వీసాలు జారీచేసేందుకు వినియోగించే కంప్యూటరైజ్డ్ లాటరీ విధానానికి స్వస్తి పలకాలని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. లాటరీ విధానం స్థానంలో ఇకపై వేతన స్థాయి ఆధారంగా హెచ్1బీ వీసాలు ఇవ్వాలని, ఈ మేరకు వీసా విధానంలో మార్పులు చేస్తున్నట్టు అమెరికా హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఇది ప్రతిపాదనల దశలో ఉంది. ఈ మేరకు 30 రోజుల స్పందన కాలంతో ఫెడరల్ రిజిస్టర్ లో ప్రకటన జారీ అయింది. ఈ 30 రోజుల వ్యవధిలో తాజా ప్రతిపాదనలపై అభిప్రాయాలు స్వీకరిస్తారు.

కాగా, నూతన విధానంలో... అత్యధిక వేతనం అందుకునేవారికి తొలి ప్రాధాన్యత ఉంటుంది. తక్కువ జీతం అందుకునేవారికి హెచ్1బీ వీసా జారీ చేసే అవకాశాలు తక్కువగానే ఉంటాయి. విదేశాలకు చెందినవారు, ముఖ్యంగా భారతీయులు తక్కువ వేతనాలకు కూడా అమెరికా వస్తుండడంతో స్థానిక అమెరికన్లు ఉద్యోగ అవకాశాల్లో వెనుకబడిపోతున్నారన్నది ట్రంప్ ఆక్రోశం.

అందుకే ఎక్కువ వేతన స్థాయి నిపుణులకు ఎక్కువ ప్రాధాన్యత అనే కొత్త వీసా విధానంతో తక్కువ వేతన స్థాయివారిని నియంత్రించి, తద్వారా అమెరికన్ల ఉపాధి అవకాశాలను మరింత మెరుగుపర్చవచ్చని ట్రంప్ భావిస్తున్నారు. ప్రతి ఏడాది అమెరికాకు భారత్ నుంచే కాక అనేక దేశాల నుంచి లక్షల్లో వలస వస్తుంటారు. వీరిలో హెచ్1బీ వీసాలు కోరేవారిని కంప్యూటర్ ద్వారా లాటరీ తీసి ఓ 65 వేల మందికి వీసాలు జారీ చేస్తుంటారు.
USA
H1B Visa
Computerised Lottery
IT Professionals

More Telugu News