Kapil Sibal: 20 మంది ఎమ్మెల్యేలతో సీఎం అయిపోదామనే.. తమాషా చేస్తున్నావా?: పైలట్‌పై విరుచుకుపడిన కపిల్ సిబల్

Kapil Sibal slams sachin piiot and kalraj mishra
  • బీజేపీలో చేరడం లేదంటూ ఇంకా హర్యానాలో ఎందుకు?
  • కొత్త పార్టీ పెట్టే ఆలోచన ఉంటే బయటపెట్టండి
  • ప్రజాస్వామ్యానికి గవర్నర్లు కొత్త భాష్యం చెబుతున్నారు
రాజస్థాన్ కాంగ్రెస్ తిరుగుబాటు నేత సచిన్ పైలట్‌పై ఆ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రశ్నల వర్షం కురిపించారు. బీజేపీలో చేరనంటూనే హర్యానాలో ఎందుకు ఉంటున్నారని, పోనీ కొత్త పార్టీ ఏమైనా పెట్టే ఉద్దేశం ఉంటే అదేదో చెప్పాలని ప్రశ్నించారు.

20-25 మంది ఎమ్మెల్యేలతో సీఎం అయిపోవాలనే కోరికను కట్టిపెట్టి తమాషాలు ఆపాలని హెచ్చరించారు. సీఎం కావాలనుకుంటే చెప్పాలని, ఎందుకీ నిరసన అని పైలట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీలో చేరడం లేదని ప్రకటించి ఇంకా హర్యానాలోనే ఎందుకు ఉంటున్నారని నిలదీశారు. మరి కాంగ్రెస్ కార్యక్రమాలకు ఎందుకు హాజరు కావడం లేదని, ఒకవేళ కొత్త పార్టీ పెట్టే ఆలోచన ఏమైనా ఉంటే ఆ విషయాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

హోటళ్లలో కూర్చుని మాట్లాడడం కాకుండా బయటకు వచ్చి మాట్లాడాలని సిబల్ సవాలు విసిరారు. మరోవైపు రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రాపైనా సిబల్ మండిపడ్డారు. గవర్నర్ తన రాజ్యాంగ విధులను మర్చిపోయి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్లు రాజ్యాంగానికి, చట్టానికి నిబద్ధులుగా ఉండడం మానేసి కేంద్రం చెప్పినట్టు నడుచుకుంటూ ప్రజాస్వామ్యానికి కొత్త భాష్యం చెబుతున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Kapil Sibal
Sachin Pilot
Rajasthan
Kalraj Mishra
Congress

More Telugu News