Supreme Court: సచిన్ పైలట్ వర్గానికి ఊరట...  హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ

Supreme Court denies to stay on Rajasthan High Court ruling on Sachin Pilot supporters
  • జూలై 24 వరకు పైలట్ వర్గంపై ఎలాంటి చర్యలు వద్దన్న హైకోర్టు
  • దీనిపై సుప్రీంను ఆశ్రయించిన రాజస్థాన్ స్పీకర్
  • సుదీర్ఘ విచారణ అవసరమన్న సుప్రీంకోర్టు
రాజస్థాన్ రాజకీయాల్లో నెలకొన్న సంక్షోభం సుప్రీంకోర్టు ముంగిట చేరిన సంగతి తెలిసిందే. సచిన్ పైలట్ వర్గంపై జూలై 24 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ రాజస్థాన్ హైకోర్టు ఆదేశాలు ఇవ్వగా, ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ రాజస్థాన్ స్పీకర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు... రాజస్థాన్ హైకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వలేమంటూ స్పష్టం చేసింది. రాజస్థాన్ హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడం ప్రస్తుతం పరిస్థితుల్లో సాధ్యం కాదని చెప్పింది. సుప్రీంకోర్టు నిర్ణయంతో సచిన్ పైలట్ వర్గానికి మరోసారి ఊరట లభించినట్టయింది.

అయితే, స్పీకర్ దాఖలు చేసిన పిటిషన్ లోని అంశాలపై సుదీర్ఘ విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని, ఈ కేసును ఈ నెల 27కి వాయిదా వేస్తున్నామని జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనం పేర్కొంది. అంతకుముందు, స్పీకర్ తరఫు న్యాయవాది కపిల్ సిబాల్ తమ వాదనలు వినిపిస్తూ, స్పీకర్ విచక్షణాధికారాల్లో హైకోర్టు జోక్యం చేసుకోజాలదని, హైకోర్టు ఆదేశాలు రాజ్యాంగ వ్యతిరేకమని తెలిపారు. అసమ్మతి సభ్యులపై స్పీకర్ నిర్ణయం తీసుకోకముందే హైకోర్టు ఏ విధంగా జోక్యం చేసుకుంటుందని అన్నారు. ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యల ద్వారా అసమ్మతి గళాన్ని అణచివేయలేరని జస్టిస్ అరుణ్ మిశ్రా వ్యాఖ్యానించారు.
Supreme Court
Sachin Pilot
High Court
Rajasthan
Stay

More Telugu News