Indians: కరోనా లక్షణాలు లేనివారినే విదేశాల నుంచి తీసుకువస్తాం: కేంద్రం స్పష్టీకరణ

Centre ready to bring back stranded Indians in abroad
  • మే 7 నుంచి విదేశాల నుంచి భారతీయుల తరలింపు
  • జాబితాలు రూపొందిస్తున్న దౌత్య కార్యాలయాలు
  • రుసుం వసూలు చేయాలని కేంద్రం నిర్ణయం
దేశంలో కరోనా పరిస్థితులను పూర్తిగా ఆకళింపు చేసుకున్న కేంద్ర ప్రభుత్వం, ఇక విదేశాల్లో నిలిచిపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. దశలవారీగా చేపట్టే ఈ ప్రక్రియ మే 7న ప్రారంభం కానుంది. ఇందుకోసం విమానాలను, నౌకలను వినియోగించనున్నారు. స్వదేశానికి రావాలనుకునే భారతీయులు కేంద్రానికి నిర్దిష్ట మొత్తంలో రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయితే, కరోనా లక్షణాలు లేనివారినే భారత్ కు తీసుకువస్తామని కేంద్రం స్పష్టం చేసింది.

కాగా, విదేశాల్లో ఉన్న భారతీయుల జాబితాను రూపొందించడంలో దౌత్య కార్యాలయాలు తలమునకలుగా ఉన్నాయి. భారత్ కు వచ్చేందుకు సిద్ధపడిన వారికి మొదట వైద్యపరీక్షలు చేయనున్నారు. కరోనా లేదని నిర్ధారణ అయితేనే విమానాలు, నౌకల్లోకి అనుమతిస్తారు.

అంతేకాదు, ప్రతి ప్రయాణికుడు విధిగా ఆరోగ్య సేతు యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. భారత్ వచ్చిన తర్వాత ప్రయాణికులు 14 రోజుల పాటు విధిగా క్వారంటైన్ లో ఉండాలని, అందుకు తగిన చార్జీ చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. విదేశాల నుంచి పెద్ద ఎత్తున పౌరులు వస్తున్నందున ఆ మేరకు టెస్టింగ్, క్వారంటైన్ ఏర్పాట్లు చేసుకోవాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది.
Indians
Abroad
Corona Virus
Planes
Ships

More Telugu News