Canada: కెనడాలో దారుణం: పోలీసు దుస్తుల్లో వచ్చి ఆగంతుకుడి కాల్పులు.. 16 మంది మృతి

Gunman kills 16 in Canda
  • మూడు దశాబ్దాల తర్వాత దారుణ ఘటన
  • ఇళ్లలోని వారిపై కాల్పులు జరిపి ఇళ్లకు నిప్పు పెట్టిన దుండగుడు
  • మృతుల్లో ఓ మహిళా పోలీసు అధికారి
కెనడాలో గత మూడు దశాబ్దాల్లో ఎన్నడూ జరగని దారుణం జరిగింది. పోలీసు దుస్తుల్లో వచ్చిన ఓ దుండగుడు విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. లాక్‌డౌన్ అమల్లో ఉన్న కెనడాలో ఈ ఘటన కలకలం రేపింది.

నోవా స్కోటియా రాష్ట్రంలోని పోర్టాపిక్‌లో జరిగిన ఈ ఘటనలో ఓ మహిళా పోలీసు కూడా మృతి చెందింది. దుండగుడు ఇళ్లలో ఉన్నవారిపై కాల్పులు జరిపిన అనంతరం ఇళ్లకు నిప్పు పెట్టినట్టు పోలీసులు తెలిపారు. ఒక ఇంటి లోపల, బయట చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలను పోలీసులు గుర్తించారు.

తన కారును పోలీసు వాహనంలా తీర్చిదిద్దిన ఆగంతుకుడు పోలీసు దుస్తులు ధరించి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. 1989లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 14 మంది మరణించారు. ఆ తర్వాత జరిగిన అతి పెద్ద ఘటన ఇదే. నిందితుడిని 51 ఏళ్ల గాబ్రియెల్ వోర్ట్‌మన్‌గా గుర్తించారు. దుండగుడిని అరెస్ట్ చేసినట్టు తొలుత చెప్పిన పోలీసులు.. ఆ తర్వాత అతడు హతమైనట్టు తెలిపారు.
Canada
Nova Scotia
Gunman

More Telugu News