Etala Rajender: టెక్నాలజీ పెరుగుతోంది...  కొత్త రోగాలు ఎక్కువవుతున్నాయి: ఈటల

TS minister Etala Rajender attends World Rare Disease Day event
  • హైదరాబాదులో ప్రపంచ అరుదైన వ్యాధుల దినోత్సవ కార్యక్రమం
  • ఫలానా అరుదైన వ్యాధికి ఫలానా మందు అనే పరిస్థితి లేదన్న ఈటల
  • జన్యు సంబంధ వ్యాధిగ్రస్తుల్లో పేదలే ఎక్కువగా బాధపడుతున్నారని ఆవేదన
ప్రపంచ అరుదైన వ్యాధుల దినోత్సవం సందర్భంగా హైదరాబాదులో జరిగిన కార్యక్రమానికి తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ హాజరయ్యారు. అరుదైన వ్యాధుల విషయంలో ఫలానా వ్యాధికి ఫలానా మందు అనే పరిస్థితి ఇప్పటివరకు లేదని, దీనిపై ప్రభుత్వాల కంటే ఫార్మా సంస్థలు చేసే పరిశోధనలే ఎక్కువని అన్నారు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతోందో, అరుదైన రోగాలు కూడా అంతగా వెలుగు చూస్తున్నాయని తెలిపారు.

జన్యు సంబంధ వ్యాధులతో బాధపడేవారిలో పేదలే ఎక్కువగా ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబంలో జన్యు సంబంధ లోపాలతో ఎవరైనా జన్మిస్తే ఆ కుటుంబంలో కల్లోలం నెలకొంటుందని అభిప్రాయపడ్డారు. ఇలాంటి వ్యాధుల విషయంలో, ప్రజలకు ఆరోగ్యం అందించడంలో తెలంగాణ ఒక కొత్త ఒరవడి సృష్టించాలని తమ ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు.

కల్యాణలక్ష్మి పథకాన్ని 18 సంవత్సరాలు నిండిన అమ్మాయిలకే వర్తింప చేస్తున్నామని, తద్వారా బాల్య వివాహాలకు అడ్డుకట్ట పడుతుందని అన్నారు. చిన్నవయసులో పెళ్లి చేసుకుని గర్భం దాల్చితే లోపాలతో కూడిన పిల్లలు పుట్టే అవకాశముందని, తల్లి కూడా రోగాల బారినపడుతుందని వివరించారు.
Etala Rajender
Hyderabad
TRS
Telangana
World Rare Disease Day

More Telugu News