BJP: స్వీప్ చేస్తామన్న టీఆర్ఎస్ అక్కడక్కడా తుడిచిపెట్టుకుపోయింది: టీ-బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్

  • మున్సిపల్ ఎన్నికల్లో మాకు మెరుగైన ఫలితాలు వస్తున్నాయి
  • సిరిసిల్లలోనే రెబెల్ అభ్యర్థులు గెలిచారు!
  • టీఆర్ఎస్ ప్రభుత్వం పనితీరు ఎలా ఉందో ఇదే నిదర్శనం

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడుతున్న విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో  తన ప్రభావాన్ని బీజేపీ కొద్దొ గొప్పో చూపించింది. ఈ సందర్భంగా తనను పలకరించిన మీడియాతో టీ-బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ, స్వీప్ చేస్తామని ప్రగల్భాలు పలికిన టీఆర్ఎస్, అక్కడక్కడా తుడిచిపెట్టుకుపోయిందని విమర్శించారు. ఈ ఎన్నికలు తమ పని తీరుకు నిదర్శనమని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావిస్తూ, సిరిసిల్లలోనే రెబెల్ అభ్యర్థులు గెలిచారంటే వాళ్ల పనితీరు ఏ రకంగా ఉందో అర్థమౌతుందని విమర్శించారు. తమ ప్రభుత్వ పనితీరే నిదర్శనం అని చెప్పుకున్న టీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో డబ్బులు పంచిపెట్టిందని ఆరోపించారు.

ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను, కాంగ్రెస్ ను, ఎంఐఎంనును బీజేపీ ఎదుర్కొందని చెప్పారు. ప్రజాతీర్పును చూస్తుంటే ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు వస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. మంత్రి ఈటల రాజేందర్ నియోజకవర్గంలో బీజేపీ నాలుగు సీట్లు గెలిచిందని చెప్పారు. నిర్ణయాత్మకశక్తిగా ఎదుగుతున్నామని, కొన్ని ప్రాంతాల్లో టీఆర్ఎస్ కు, మరికొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి, భైంసా వంటి ప్రాంతంలో ఎంఐఎంకు దీటుగా తాము ఫలితాలు సాధించామని అన్నారు.

More Telugu News