NDTV: విదేశాలకు వెళుతుండగా ‘ఎన్డీటీవీ’ చీఫ్ ప్రణయ్ రాయ్ ను అడ్డుకున్న సీబీఐ!

  • మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రణయ్ రాయ్ దంపతులు
  • విదేశాలకు వెళ్తుండగా విమానాశ్రయంలో ఆపుదల 
  • సౌతాఫ్రికాకు వెళ్లనున్నారంటూ సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యలు
మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్టీటీవీ నెట్‌వర్క్ వ్యవస్థాపకుడు ప్రణయ్ రాయ్, ఆయన భార్య రాధిక రాయ్‌లు విదేశాలకు వెళ్లేందుకు ముంబై విమానాశ్రయానికి రాగా, అక్కడ సీబీఐ వారిని అడ్డుకుంది. వారం రోజుల పర్యటన నిమిత్తం విదేశాలకు వెళ్తున్న ప్రణయ్ రాయ్ దంపతులు, ఈ నెల 15న తిరిగి భారత్ కు రావడానికి రిటర్న్ టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. అయినప్పటికీ వారిని అడ్డుకోవడం దారుణమని ఎన్డీటీవీ ఓ ప్రకటనలో పేర్కొంది.  

మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రణయ్ రాయ్ దంపతులపై జూన్‌లో సెబీ నిషేధం విధించింది. రెండేళ్లపాటు ప్రణయ్ రాయ్ దంపతులతోపాటు హోల్డింగ్ కంపెనీలు క్యాపిటల్ మార్కెట్ కార్యకలాపాల్లో పాల్గొనరాదని ఆదేశించింది. అలాగే, ఈ సమయంలో బోర్డు పదవితో ఉన్నత ఉద్యోగాలు చేపట్టొద్దని ఆదేశాలు జారీ చేసింది.

ఐసీఐసీఐ బ్యాంక్, ఇతర సంస్థల నుంచి రుణాలు తీసుకునే విషయంలో మైనారిటీ వాటాదారులకు తగిన వివరాలు వెల్లడించలేదని, అందుకే ఈ నిషేధం విధిస్తున్నామని సెబీ పేర్కొంది. ప్రణయ్ రాయ్ దంపతులు దక్షిణాఫ్రికాకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారంటూ ఇటీవల బీజేపీ సీనియర్ నేత, ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ ఘటన జరగడం ప్రాధాన్యం ఏర్పడింది.
NDTV
Prannoy Roy
abroad
arrest

More Telugu News