Andhra Pradesh: వైఎస్ వివేక హత్యతో నాకు సంబంధం లేదు.. నేను తప్పుచేసినట్లు తేలితే ఉరితీయండి!: సుధాకర్ రెడ్డి

  • వివేకానందరెడ్డి ఇల్లు ఎక్కడుందో కూడా నాకు తెలియదు
  • అరటిపంట వేసుకుని సాగుచేసుకుంటున్నా
  • రాజారెడ్డి కేసులో నన్ను అక్రమంగా ఇరికించారు

వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని వైఎస్ రాజారెడ్డి హత్యకేసులో జైలు శిక్ష అనుభవించి, ఇటీవలే విడుదలైన సుధాకర్ రెడ్డి తెలిపారు. వివేకానందరెడ్డి ఇల్లు ఎక్కడుందన్న విషయం కూడా తనకు తెలియదని వ్యాఖ్యానించారు. తాను ఇప్పుడు 9 ఎకరాల్లో అరటిపంట వేసుకుని సాగుచేసుకుంటున్నానని పేర్కొన్నారు. అసలు వైఎస్ రాజారెడ్డి హత్యతో కూడా తనకు సంబంధం లేదనీ, అన్యాయంగా ఆ కేసులో తనను ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు.

తాను 12 సంవత్సరాలు జైలులో నరకయాతన అనుభవించానని తెలిపారు. గతేడాది జూన్ 20న తాను జైలు నుంచి విడుదల అయ్యానన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన సమయంలో తాను ఇంట్లోనే ఉన్నానని వ్యాఖ్యానించారు.

తన పేరు టీవీలో రావడంతో తాను పోలీస్ స్టేషన్ కు వెళ్లివచ్చానన్నారు. అయితే ఎస్సై లేకపోవడంతో కానిస్టేబుల్ తో మాట్లాడి వచ్చానన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి వ్యవహారంలో తన పాత్ర ఉన్నట్లు తేలితే తనను ఉరితీయాలని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News