Arasavalli: సూర్య నారాయణుని చెంత అద్భుత దృశ్యం... నాలుగేళ్ల తరువాత స్వామిని పూర్తిగా తాకిన కిరణాలు!

  • స్వామివారిని తాకిన ఆదిత్యుడు
  • పులకించిన భక్తజనం
  • రేపు కూడా స్వామిపై కిరణాలు పడే అవకాశం
శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీసూర్య నారాయణ స్వామి దేవాలయంలో నాలుగేళ్ల తరువాత ఈ ఉదయం ఆదిత్యుని కిరణాలు పూర్తి స్థాయిలో స్వామివారిని తాకాయి. నిన్న పాక్షికంగా కేవలం మూలవిరాట్టు ముఖంపై మాత్రమే పడిన కిరణాలు, నేడు ఆపాదమస్తకం స్వామిని ఆక్రమించాయి. దీంతో భక్తులు పులకించిపోయారు. గడచిన మూడు సంవత్సరాలుగా మేఘాలు అడ్డువస్తుండటం, అల్పపీడనాల ప్రభావంతో సూర్య కిరణాలు ఆదిత్యుని చెంతకు చేరలేకపోయాయి.

ఈ ఉదయం బంగారు ఛాయలోని లేలేత కిరణాలు స్వామిపై పడటం, పాదాల నుంచి ముఖం వరకూ కమ్మేయడంతో స్వామివారు మెరిసిపోయారు. దీంతో భక్తులు పరమానంద భరితులయ్యారు. ప్రతి సంవత్సరం రెండుసార్లు సూర్యుడి కిరణాలు అరసవల్లి సూర్య నారాయణుని తాకుతాయన్న సంగతి తెలిసిందే. కాగా, రేపు కూడా స్వామివారిపై కిరణాలు పడే అవకాశాలు ఉన్నాయని ఆలయ పూజారులు తెలిపారు. 
Arasavalli
Sun
Suryanarayana Swami
Sun Rays

More Telugu News