T20 cricket: టీ20 క్రికెట్‌లో పాక్ క్రికెటర్ సంచలన రికార్డు!

  • టీ20 క్రికెటర్ మహమ్మద్ ఇర్ఫాన్ సంచలనం
  • నాలుగు ఓవర్లు వేసి ఒకే ఒక్క పరుగు ఇచ్చిన బౌలర్
  • అత్యంత తక్కువ పరుగులు ఇచ్చిన బౌలర్‌గా రికార్డు
టీ20 క్రికెట్‌లో సరికొత్త రికార్డు నమోదైంది. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా బార్బడోస్ ట్రైడెంట్, సెయింట్ కిట్స్ అండ్‌ నేవిస్‌ పాట్రియాట్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ ఇర్ఫాన్ అత్యంత అరుదైన రికార్డు సృష్టించాడు. బార్బడోస్ జట్టు తరపున ఆడుతున్న ఇర్ఫాన్ ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్ వెన్నులో వణుకు పుట్టించాడు.

నాలుగు ఓవర్లు వేసిన ఇర్ఫాన్ వరుసగా 23 బంతులను డాట్ బాల్స్ వేశాడు. చివరి బంతికి మాత్రం ఒకే ఒక్క పరుగు ఇచ్చాడు. ఓపెనర్లు క్రిస్‌ గేల్‌, ఇవిన్‌ లెవిస్‌ వికెట్లను పడగొట్టాడు. చివరి బంతికి కనుక పరుగు ఇవ్వకుంటే వేసిన నాలుగు ఓవర్లూ మెయిడెన్లుగా మరో రికార్డు అతడి పేరును నమోదై ఉండేది.  నాలుగు ఓవర్లు వేసి మూడు మెయిడెన్లు తీసుకుని ఒక్క పరుగు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్న ఇర్ఫాన్ టీ20 చరిత్రలోనే అత్యంత తక్కువ పరుగులు ఇచ్చిన బౌలర్‌గా రికార్డులకెక్కాడు.

ఈ రికార్డు పదికాలాల పాటు పదిలంగా ఉండడం గ్యారెంటీ అని క్రీడా పండితులు చెబుతున్నారు. దీనిని బద్దలుగొట్టడం మరే బౌలర్‌కీ సాధ్యం కాకపోవచ్చని అంటున్నారు. కాగా, ఇర్ఫాన్ అద్భుత ప్రతిభతో ఆకట్టుకున్నప్పటికీ బార్బడోస్ జట్టుకు ఓటమి తప్పలేదు. తొలుత బ్యాటింగ్ చేసి నిర్దేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని కిట్స్ జట్టు మరో 7 బంతులు మిగిలి ఉండగానే నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.  
T20 cricket
Pakistan
Fast bowler
Mohammad Irfan
Barbados

More Telugu News