Krishna District: కృష్ణా జిల్లాలో కాలువలోకి దూసుకెళ్లిన కారు.. కొట్టుకుపోయిన ఎస్సై

  • అవనిగడ్డ-బెజవాడ కరకట్టపై ఘటన
  • బందరు కాలువలోకి దూసుకెళ్లిన కారు
  • తల్లిని కాపాడి గల్లంతైన ఎస్సై

కృష్ణా జిల్లాలో ఈ రోజు ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రాపురం నుంచి కోడూరుకు వెళుతున్న ఓ కారు అవనిగడ్డ-బెజవాడ కరకట్టపై పాపవినాశనం వద్ద అదుపు తప్పి బందరు కాలువలోకి దూసుకెళ్లింది. కాలువలో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో కారులో ఉన్న ఎస్సై కోట వంశీ గల్లంతయ్యారు.

రామచంద్రాపురం ఎస్సై కోట వంశీ తల్లితో కలసి స్వగ్రామం కోడూరుకు ఈ రోజు బయలుదేరారు. ఈ నేపథ్యంలో పాపవినాశనం వద్ద కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లగానే వాహనంలోనే ఉన్న తల్లిని వంశీ ఒడ్డుకు తీసుకొచ్చారు. అనంతరం కారులో ఉన్న బ్యాగ్ ను తెచ్చేందుకు మళ్లీ కారులోకి వెళ్లిన వంశీ భారీగా వస్తున్న నీటి ప్రవాహం కారణంగా గల్లంతయ్యారు. ఎస్సైతో పాటు కారు కూడా వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది.

ప్రత్యక్ష సాక్షుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలను మొదలుపెట్టారు. కాలువ పైన గేట్లను మూసివేసి నీటి ప్రవాహాన్ని తగ్గించేందుకు యత్నిస్తున్నారు. కళ్ల ముందే కుమారుడు గల్లంతు కావడంతో ఆ తల్లిని ఓదార్చడం ఎవరివల్లా కావడం లేదు.


Krishna District
accident
avanigadda
ramachandrapuram
bandaru canal
  • Loading...

More Telugu News