suresh babu: 'హ్యాపీ ఆవులు' పేరిట పాల వ్యాపారాన్ని ప్రారంభించిన సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు

  • పాలు, కూరగాయల వ్యాపారంలోకి సురేష్ బాబు
  • రసాయనాలు లేని స్వచ్ఛమైన పాల ఉత్పత్తి
  • లీటర్ పాలు రూ.150

ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు పొలం బాట పట్టారు. సరికొత్త వ్యాపారాన్ని ప్రారంభించారు. మార్కెట్లో లభిస్తున్న పాలు, కూరగాయల్లో రసాయనాల ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, ఇటీవలే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. దీంతో స్వచ్ఛమైన పాలు, సేంద్రీయ సేద్యంతో కూరగాయలు అందించాలనే నిర్ణయానికి ఆయన వచ్చారు. ఈ క్రమంలో, హైదరాబాద్ నగర శివార్లలో తనకు ఉన్న 30 ఎకరాల వ్యవసాయ భూమిలో 30 ఆవులను పెంచుతున్నారు. 'హ్యాపీ ఆవులు' పేరుతో స్వచ్ఛమైన పాల ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ, తన వ్యవసాయ క్షేత్రంలో ఆవులకు సేంద్రీయ ఆహారం, స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నామని చెప్పారు. దీంతో, అవి స్వచ్ఛమైన (రసాయనాలు లేని) పాలను ఇస్తున్నాయని తెలిపారు. లీటరు పాలను రూ. 150కి విక్రయించాలని నిర్ణయించామని చెప్పారు. డబ్బు సంపాదించాలనే ధ్యేయంతో తాను ఈ పని చేయడం లేదని చెప్పారు. స్వచ్ఛమైన పాలకు, బయట దొరుకుతున్న పాలకు ఉన్న తేడా ఏమిటో ప్రజలకు తెలియజేయాలనేదే తన ఆకాంక్ష అని చెప్పారు. తన ఫిలిం స్టూడియోను కూడా పూర్తిగా పర్యావరణ అనుకూలమైనదిగా చేయాలనుకుంటున్నానని తెలిపారు. ఇప్పటికే ప్లాస్టిక్ బాటిళ్ల స్థానంలో స్టీలు సీసాలను వాడుతున్నామని చెప్పారు. 

More Telugu News