Nagarkurnool District: కన్నతల్లి ప్రియుడి కోసం... తండ్రిని చంపేందుకు సహకరించిన కొడుకు!

  • నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో ఘటన
  • భర్తను కడతేర్చేందుకు ప్రియుడు, కుమారుడితో కలసి పథకం
  • రెండు నెలల తరువాత విషయం బట్టబయలు

ప్రియుడిని వదిలి ఉండలేక పోయిన ఓ మహిళ, అతనితో కలసి కట్టుకున్న భర్తను హత్య చేయాలని ప్లాన్ వేయగా, ఆమెకు కన్న కొడుకు కూడా తోడై సాయపడిన ఘటన నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో కలకలం రేపింది. ఘటన జరిగిన రెండు నెలల తరువాత పోలీసులు నిజాన్ని వెలికి తీశారు.

మరిన్ని వివరాల్లోకి వెళితే, కల్వకుర్తి పరిధిలోని హనుమాన్ నగర్ లో కావలి మల్లయ్య (42), పార్వతమ్మ (38) నివాసం ఉంటున్నారు. వీరికి 22 సంవత్సరాల క్రితం వివాహం జరుగగా, కుమారుడు శ్రీకాంత్ (16), కుమార్తె శ్రీలత (13) ఉన్నారు. హైదరాబాద్ లో కూలిపని చేసే మల్లయ్య, ప్రతి రెండు వారాలకు ఒకసారి మాత్రమే ఇంటికి వెళుతుండేవాడు. ఈ క్రమంలో ఇంటి పక్కనే ఉన్న మేస్త్రీగా పని చేసే రాముతో పార్వతికి పరిచయం కాగా, వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.

దీన్ని గమనించిన మల్లయ్య, హైదరాబాద్ ను వదిలి కల్వకుర్తికి వచ్చినప్పటికీ, రాముతో సంబంధాన్ని వదులుకోలేక పోయింది. భర్తను చంపేస్తే ఇబ్బందులు ఉండవని భావించి, ఏప్రిల్ 20న ప్లాన్ వేసి, రాము, శ్రీకాంత్ ల సాయంతో హత్య చేసింది. మృతదేహాన్ని ముక్కలుగా చేసి, ఓ సంచీలో కుక్కి, దానికి సిమెంట్ కడ్డీలు కట్టి, నాగసముద్రం చెరువులో పడవేయించింది.

ఆపై చాలా రోజులైనా మల్లయ్య ఇంటికి రాకపోవడంతో అనుమానించిన ఆయన తల్లి బాలమ్మ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, ఆ మరుసటి రోజు తన భర్త కనిపించడం లేదని పార్వతమ్మ కూడా ఫిర్యాదు చేసింది. దీనిపై విచారించిన పోలీసులకు పార్వతమ్మపై అనుమానం రాగా, ఆమె కాల్ డేటాలో పలుమార్లు రాము నంబర్ ను చూసి, ఇద్దరినీ అరెస్ట్ చేసి విచారించగా, అసలు విషయం బయటపడింది. ఆపై మృతదేహాన్ని బయటకు తీయించిన పోలీసులు, నిందితులందరినీ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

Nagarkurnool District
Kalvakurti
Extra Marital Affair
Murder
  • Loading...

More Telugu News