Lord Hanuman: ఆంజనేయుడే తొలి గిరిజన నేత.. తేల్చేసిన బీజేపీ నాయకుడు!

  • ప్రపంచంలోనే తొలి గిరిజన నేత హనుమంతుడే
  • ఆయనను కించపరడం తగదు
  • బీజేపీ ఎమ్మెల్యే జ్ఞాన్‌దేవ్ అహుజ

రామభక్తుడు హనుమంతుడు ఎవరు? మీకెప్పుడైనా ఈ సందేహం వచ్చిందా? మరేం పర్లేదు.. రాజస్థాన్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే జ్ఞాన్‌దేవ్ అహుజ ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేశారు. ఆంజనేయుడు ప్రపంచంలోనే తొలి గిరిజన నేత అని, ఆదివాసీ దళాన్ని ఏర్పాటు చేశాడని, తర్వాత శ్రీరాముడి శిక్షణలో ఆరితేరాడని వివరించారు. అలాంటి నేతను కించపరిచి మాట్లాడడం, తక్కువ చేయడం తగదని హితవు పలికారు.

ఏప్రిల్ 2న నిర్వహించిన ‘భారత్ బంద్’ సందర్భంగా బర్మెర్‌లో హనుమంతుడి ఫొటోను కించపరిచిన ఘటన ఒకటి తన దృష్టికి వచ్చిందన్న అహుజ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆంజనేయుడు హిందువుల ఆరాధ్య దైవమని, ప్రపంచంలోనే తొలి ఆదివాసీ నాయకుడని సూత్రీకరించారు. కాగా, అహూజ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు.. 2016లో ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనమయ్యాయి. ఢిల్లీలోని జేఎన్‌యూలో చదువుకుంటున్న వారేమీ చిన్నపిల్లలు కారని, ఇద్దరేసి పిల్లల్ని కన్నవారేనని పేర్కొన్నారు. అలాగే యూనివర్సిటీ సెక్స్, డ్రగ్స్ వాడకానికి హబ్‌గా మారిందని పేర్కొని దుమారం రేపారు. ఇక్కడ ఉదయం శాంతియుత నిరసనలు చేస్తారని, రాత్రి కాగానే అశ్లీల డ్యాన్సులతో రెచ్చిపోతారని వ్యాఖ్యానించి  విమర్శల పాలయ్యారు.

More Telugu News