: సమస్య కంటే సంకల్పం గొప్పదని నిరూపించిన మహిళ!

లండన్ లో ఓ మహిళ సమస్య కంటే సంకల్పం గొప్పదని నిరూపించిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...లండన్ లో నివసించే జాక్వీ గతంలో ఓసారి స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. అక్కడున్న స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేయాలనిపించి, ఓసారి డైవ్ చేసింది. డైవ్ బెడిసి కొట్టి వంకరగా స్విమ్మింగ్ పూల్ లో కిందపడడంతో ఆమె మెడ నరాలు దెబ్బతిన్నాయి. దీంతో ఆమె పక్షవాతంలాంటి అనారోగ్య సమస్యను ఎదుర్కొంది. ఎటూ కదలలేని స్థితిలో కుర్చీకే పరిమితమైంది. అయితే, ఎలాగైనా లేచి నడవాలని ఆమె సంకల్పించుకుంది. దీనికి ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా ఎంతగానో సహకరించాడు. వ్యక్తిగత ఫిజికల్ ట్రైనర్ ను కూడా నియమించుకుంది. ట్రైనర్ పర్యవేక్షణలో క్రమం తప్పకుండా కసరత్తులు చేసింది. ఆమె ప్రయత్నానికి ప్రియుడి ప్రేమ, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం తోడైంది. దీంతో ఆమె మెల్లిగా లేచి నిల్చోగల సామర్థ్యం పొందింది. ఈ నిల్చోవడం కొద్దిసేపే అయినా ఆమెలో అంతులేని ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఇంతలో బాయ్ ఫ్రెండ్ తో పెళ్లికి ముహూర్తం కూడా నిర్ణయించారు. త్వరలోనే ముహూర్త సమయం వచ్చేసింది. పెళ్లిలో స్నేహితురాలిని పిలిచి తనను నిల్చొబెట్టాలని కోరిన జాక్వీ, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తూ, ఆ రోజు మెల్లిగా అడుగులో అడుగు వేస్తూ కాబోయే భర్తను చేరింది. ఇదే అద్భుతమనుకుంటే అతని చేతిలో చెయ్యేసి సాల్సా డాన్స్ స్టెప్పులు వేసింది. వివాహ తంతు ముగిసేవరకు అంటే సుమారు నాలుగు గంటలపాటు నిలబడే వుంది. దీంతో అంతా ఆశ్చర్యపోయారు. ఆమె బలమైన సంకల్పమే ఆమెను నడిచేలా, అంతసేపు నిల్చుండేలా చేసిందని, ఆమె మామూలు మనిషవ్వడానికి ఇక ఎంతో సమయం పట్టదని పేర్కొంటూ అంతా ఆమెను అభినందనల్లో ముంచెత్తారు.

More Telugu News